Telangana Weather: అమ్మో చలి.. గజగజ వణుకుడే.. చిన్నా పెద్దా తేడా లేకుండ చలిగాలుల ధాటికి తెగ భయపడిపోతున్నారు ప్రజలు. ఉదయం కంటే రాత్రి వీచే చలిగాలులు అధికంగా ఉంటున్నాయట. అందుకే రాత్రి కాగానే బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించడం లేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలిగాలులు అధికమవుతున్న పరిస్థితి ఉంది. అసలే చలిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చలిపులి గురించి హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. దీంతో తెల్లవారుజామున భారీగా మంచు పడుతోంది. రాత్రి వేళ.. చలి చంపేస్తోంది. అయితే తెలంగాణ వాసులకు చలి గాలుల నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం ఉండేలా లేదు. అలాంటి వేళ.. భారత వాతావరణ విభాగం కీలక అప్ డేట్ ఇచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్ నగర ప్రజలకు శీతాకాలపు చలి గాలుల నుండి ఉపశమనం లభించే అవకాశం లేదట. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ సైతం ప్రకటించింది.
ఇక ఉష్ణోగ్రతలు రాత్రి పూట 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా, వికారాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అలాగే రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సైతం ఇదే వాతావరణం వర్తిస్తోందని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో బుధవారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరోవైపు తెలంగాణలో ఉదయం పూట భారీగా చలి వేస్తోంటే.. మధ్యాహ్నం మాత్రం ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే.. ఉదయం పూట ఉష్ణోగ్రతలు10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. కానీ మధ్యాహ్నం కాగానే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంది.
మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్టంగా16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే.. గరిష్టంగా 32 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ భిన్న వాతావరణం వల్ల ప్రజలు.. సీజనల్ వ్యాధులతోపాటు ఇతర ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది..