Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో భయాందోళనలు కలిగించిన 17 మంది వరస మరణాల ఘటనలో ఆసక్తికర అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. మూడు కుటుంబాలకు చెందిన మృతులందరి వైద్య పరీక్షల్లో అందరిలో ఒకే రకమైన సమస్యను గుర్తించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో వీరి మరణాలు కారణాలు ఏంటి? అందరూ ఒకే రకమైన సమస్యతో ఎందుకు మరణించారు.? అనేది ఆసక్తికరంగా, ప్రశ్నార్థకంగా మారింది.
జమ్ము కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని బఢాల్ గ్రామానికి చెందిన మూడు కుటుంబాల్లో నెల రోజుల వ్యవధిలోనే 17 మంది వరసగా మరణించారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందే వీరంతా బంధువుల ఇంట్లో ఓ వింధు కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తించారు. దాంతో.. విందు సమయంలో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే.. వారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడం.. అంతా ఒకరి తర్వాత ఒకరు, ఒకే రకమైన అనారోగ్యాలతో మరణించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి. ఈ మిస్టరీ మరణాలపై కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. వరుస మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
గ్రామంలో పర్యటించిన ఉన్నతాధికారులు.. మరణాల సమయంలో వారందరూ ఓ విందు కార్యక్రమంలో కలిసి పాల్గొన్నట్టు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 7న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విందుకు హాజరై వచ్చారు. ఆ తర్వాత వారిలో ఐదుగురు మరణించారు. ఆ ఘటన మరువక ముందే ఐదు రోజుల వ్యవధిలోనే వారి బంధువులలో మరో తొమ్మిది మంది అనారోగ్యం పాలై, వారిలో ముగ్గురు కన్నుమూశారు. వీరి లాగే.. జనవరి 12న సైతం ఓ విందు కార్యక్రమానికి హాజరై వచ్చిన మరో కుటుంబానికి చెందిన అంతా తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. వారిలోనూ కొంత మంది మృతి చెందడంతో.. మొత్తంగా మరణాల సంఖ్య 17కు చేరుకుంది.
మృతదేహాలకు క్షుణ్ణంగా పోస్టుమార్టం నిర్వహించిన రాజౌరి ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు.. మృతులందరిలో మెదడు వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే.. వారి నాడీ వ్యవస్థ మొత్తం చచ్చుబడిపోయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియా వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో.. హోంశాఖ ప్రత్యేక బృందాలను ఈ మరణాలకు కారణాల్ని కనుక్కోవాల్సిందిగా పంపించింది. ఈ నిపుణుల పరిశీలనలో మిస్టరీ మరణాల గుట్టు కనిపెట్టేందుకు అత్యాధునిక లాబరేటరీల్లో వివిధ నమూనాలను పరిశీలించారు. చంఢీ ఘడ్, లక్నోల నుంచి ఫోరెన్సిక్ విభాగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ బృందాలు సైతం.. ఈ మరణాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతానికి.. అత్యంత కీలకమైన సమాచారం తెలిసిందంటున్నారు.. ఈ విభాగం అధికారులు. అన్ని మరణాల్లో మెదడు, నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినడం అసాధారణం అని, అందుకు ఏవైనా ప్రత్యేక కారణాలు ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు.
మృతి చెందే ముందు అందరికీ తీవ్రమైన జ్వరం, కడుపులో తిప్పడం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన వారంతా కొన్ని రోజులకు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే సరైన సమయంలో ఆసుపత్రుల్లో చేరితే వారిని కాపాడేందుకు అవకాశం ఉంది అంటున్నారు.. రాజౌరీ వైద్య కళాశాల వైద్యులు. ఇదే గ్రామం నుంచి ఇలాంటి లక్షణాలతోనే తమ వద్దకు వచ్చిన 9 మందిలో.. ఐదుగురు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. బాధిత ప్రాంతం నుంచి ఇలాంటి లక్షణాలతో వస్తున్న వారికి ముందస్తుగా సిటీ స్కాన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఆయన.. మెదడుకు ఇబ్బంది కలిగిన కేసుల్లో మాత్రం మరణాల్ని నివారించడం కష్టంగా ఉన్నట్లు అంగీకరించారు.
ప్రస్తుతం ఆ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపిన అధికారులు.. ఒకరికొకరు ఆహారం మార్చుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మరణాలన్నీ మిస్టరీగానే ఉండగా.. అందుకు కారణాలను త్వరలోనే కనుక్కుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణమని భావించినా.. తమ పరిశీలనలో అలాంటి ఆధారాలు లభించలేదని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఈ విషయంపై స్పందించిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా.. తమ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రామంలోని మరణాలను నిరోధించేందుకు.. వైద్య ఆరోగ్యశాఖతో పాటుగా అనేక ఇతర శాఖలు అండగా నిలుస్తాయని హామి ఇచ్చారు. అలాగే.. అసలు సమస్యకు కారణాలు కనుగొనేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందంటూ ప్రకటించారు.
Also Read : ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులతో.. జీతాలు, పింఛన్లు ఎంత పెరుగుతాయో తెలుసా..
వరుస మరణాల విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపిన ఓమర్ అబ్దుల్లా.. మరణాల వెనుక కారణాలు కనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే.. గ్రామం మొత్తానికి రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. మరణాలకు బ్యాక్టీరియా, వైరస్ కారణం కాదని తేలడంతో.. ఈ కేసు దర్యాప్తును కేంద్రం నియమించిన నిపుణుల బృందాలతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే.. ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.