Kakatiya University: వరంగల్ జిల్లాలో గల కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాకతీయ విశ్వవిద్యాలయంకు విద్యార్థులు ఏకంగా బీసీ ఛాంబర్ లో పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేయగా, చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే?
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇటీవల పీహెచ్డీ సీట్ల కేటాయింపులు జరిగాయి. వీటి కేటాయింపులు అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే నాలుగు నెలలుగా పీహెచ్డీ సీట్ల కేటాయింపులో వైస్ ఛాన్స్ లర్ కాలయాపన చేస్తున్నారని, ఆయన తీరుతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ వారు నిరసన తెలిపారు. వీసీ కార్యాలయంలోకి వెళ్లిన విద్యార్థులు ఏకంగా పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేయడం సంచలనంగా మారింది. సీట్లను వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
వీసీ ఛాంబర్ లో విద్యార్థులు పెట్రోల్ బాటిల్ తో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, మాట వినకపోవడంతో చిట్ట చివరకు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. పోలీసుల అరెస్ట్ చేస్తున్న సమయంలో సైతం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.