Chit Fund Fraud: స్వేచ్ఛ బ్యూరో: రూ. 4 కోట్ల చిట్ ఫండ్ మోసం కేసులో శంకర్‌పల్లి పోలీసులు గుడిశెట్టి సుధాకర్ (50) అనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీలు ఇస్తానని ఆశచూపి దాదాపు రూ.4 కోట్లతో పరారైన అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
నమ్మించి మోసం చేసిన తీరు
శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన సుధాకర్, తన భార్య లక్ష్మితో పాటు మరి కొందరితో కలిసి 2021 నుంచి 2024 వరకు అక్రమంగా చిట్టీల వ్యాపారం నడిపాడు. తమ వద్ద డబ్బులు దాచుకుంటే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని స్థానికులను నమ్మించాడు. దీంతో బాధితులు ప్రతినెలా రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు సుధాకర్‌కు చెల్లిస్తూ వచ్చారు. ఈ విధంగా మొత్తం 48 మంది నుంచి సుమారు రూ. 4 కోట్లు వసూలు చేశాడు.
అదృశ్యం కావడంతో వెలుగులోకి..
ప్రతి నెలా డబ్బులు తీసుకున్న నిందితుడు, జూన్ 2024లో బాధితులకు ఎలాంటి సొమ్ము తిరిగి ఇవ్వకుండా ఉన్నపళంగా అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా సుధాకర్ ఆచూకీ దొరక్కపోవడం, ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బాధితుడి ఫిర్యాదుతో అరెస్ట్
సుధాకర్ తన వద్ద రూ. 6.60 లక్షలు తీసుకొని మోసం చేశాడని అశ్విన్ అనే బాధితుడు శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ రుద్వీర్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
Also Read: పొమ్మనకుండా పొగబెట్టారు.. ఆత్మగౌరవం చంపుకోలేకే బయటకొచ్చా: విజయసాయిరెడ్డి