ఈ ఏడాది వేసవి మరింత హాట్ హాట్ గా ఉంటుందనే సంకేతాలు ఇప్పటికే అందాయి. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏప్రిల్, మే లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 20 తర్వాత తెలంగాణ వాతావరణంలో ఊహించని మార్పు వస్తుందని తెలిపింది. వాతావరణం చల్లబడుతుందని, వర్షాలు కురుస్తాయని చెప్పింది.
మరొకరోజు తప్పదు..
ప్రస్తుతం ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆయా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ కి పెరిగాయి. ఈ పెరుగుదల ప్రభావం మరొకరోజు కూడా కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే మార్చి 20 తర్వాత పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
మార్చి 20 తర్వాత తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుంది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడే అవకాశముంది. మార్చి 21న పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం అవుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశముంది. ఇక మార్చి 22, 23 తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కు తగ్గిపోతాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం అవుతాయి. మార్చి 21నుంచి మొదలు కొని 24 వరకు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనపడుతుంది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు తెలంగాణ వాసులు ఎండవేడికి అల్లాడిపోయారు. ఈ ఏడాది మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ వాసులు ఎండ తీవ్రతకు రోడ్లపైకి రాలేకపోతున్నారు. మెట్రోలో ప్రయాణిస్తున్నా కూడా ఉక్కపోత తప్పడంలేదు. మధ్యాహ్నం పూట ప్రయాణికులు రోడ్లపైకి వచ్చేందుకు సాహసం చేయడంలేదు. వారాంతాల్లో రోడ్లు మరింత ఖాళీగా కనపడుతున్నాయి. ఈ ఉక్కపోతకు ఉపశమనం కలిగిస్తూ వర్షం పడుతుందంటూ తాజాగా భారత వాతావరణ శాఖ(IMD) చల్లని కబురు చెప్పింది. మరొక్కరోజు ఉక్కపోతని భరిస్తే, ఆ తర్వాత 4 రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుంది. వాతావరణ మార్పుపై IMD సమాచారంతో తెలంగాణ వాసులు ఊరట చెందుతున్నారు. వర్షాలతో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే 4 రోజుల తర్వాత మళ్లీ ఉక్కపోత తప్పదని, గరిష్ట ఉష్ణోగ్రతలు యథాస్థితికి చేరుకుంటాయని IMD హెచ్చరించడం విశేషం. వర్షాలు వస్తాయన్న వార్త కాస్త ఉపశమనం కలిగిస్తున్నా.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయనే వార్త మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ కి గురికాకుండా ఉండాలని దానికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.