Temple Lands: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ఆలయ భూముల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించారు. నెలలు గడుస్తుంది కానీ.. వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఒక్క హైదరాబాద్ మినహా ఏ జిల్లా నుంచి భూముల వివరాలు రాలేదు. దీంతో ఏసీ, డీసీ, ఈఓలు మేరకు అధికారుల ఆదేశాలు పాటిస్తున్నారు. వారు పర్యవేక్షిస్తున్న భూముల వివరాలు అసలు తెలుసా? లేదా? లేకుంటే వారే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారా? లేకుంటే వారి అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వానికి ఇవ్వడం లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దేవుడి మాన్యాలను కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ సర్వేకు అధికారులు వివరాలు ఇవ్వకపోవడం అడ్డంకిగా మారింది.
దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోంది. రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకుండా ఉంది. ఆలయ భూములను రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం, మౌనం వహిస్తుండటంపై పలు విమర్శలకు దారితీసింది. దేవుడి భూముల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. అందుకు ఏ ఆలయ పరిధిలో ఎంత భూమి ఉందో వివరాలు అందజేయాలని ఏసీలు, డీసీలు, ఈఓ(ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు)ఆదేశాలు ఇచ్చింది. కానీ నెలలు గడుస్తుంది. అయినప్పటికీ ఆలయ భూముల వివరాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే రికార్డులు దాస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పూర్తి స్థాయి రికార్డులు సైతం కొంతమంది ఈఓల దగ్గర లేవనే ప్రచారం జరుగుతుంది. అందుకే భూ వివరాలను ఇవ్వడం లేదని, వారికే మాన్యం భూమి ఎక్కడ ఉందో తెలియదని అలాంటప్పుడు ఎలా ఇస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏళ్ల తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్నప్పటికీ ఆయా వివరాలను సేకరించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో 87235.39 ఎకరాలు ఆలయ భూములు ఉండగా ఏకంగా 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కాగా విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలోనే భూములు ఎక్కువగా ఆక్రమణకు గురయ్యాయి. రెండోస్థానంలో మేడ్చల్ జిల్లా , మూడోస్థానంలో హైదరాబాద్ జిల్లా ఉంది. అయితే, భూముల సరిహద్దులు గుర్తించేందుకు, జియో ట్యాగింగ్ చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వేను ప్రతిపాదించింది. కానీ, ఈ సర్వేకు కావాల్సిన పాత రికార్డులు, రిజిస్టర్లను అందించడంలో ఆఫీసర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఒక రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆఫీసర్లు మినహా మిగతా జిల్లాల ఏసీలు, ఈవోలు ఇంకా ఆలయ భూముల సంబంధించిన వివరాలు అందజేయలేదు. కొన్ని జిల్లాల ఆఫీసర్లు కొందరు ఆలయానికి సంబంధించిన రికార్డులే లేవని చెబుతుండటం విశేషం. గతంలో జరిగిన భూ దందాలు, అక్రమ లీజుల వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయోనని క్షేత్రస్థాయి అధికారులు వెనుకంజ వేస్తున్నారని సమాచారం.
తొలి విడతలో 40 వేల ఎకరాల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్-సికింద్రాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టనున్నారు. హైదరాబాద్ పాతబస్తీ, సికింద్రాబాద్, అంబర్‌పేట వంటి ప్రాంతాల్లో సుమారు 1,200 నుంచి 1,500 ఎకరాల ఆలయ భూమి ఉంది. ఇందులో 60% పైగా భూమి కబ్జాల్లో, కోర్టు కేసుల్లో చిక్కుకుంది. ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ పరిసరాల్లో వేల కోట్ల విలువైన భూములున్నాయి. ఈ జిల్లాల్లో ఆలయ భూములు వేల ఎకరాలుండగా.. ప్లాట్లుగా మార్చేసి అమ్ముకున్న సంఘటనలున్నాయి. లీజుల పేరుతో నామమాత్రపు ధరకే దక్కించుకుని ఇప్పుడు అక్కడ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించినట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ దేవుడి భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. వరంగల్ లో సుమారు 7,000 ఎకరాల భూమి ఆలయాల పేరిట ఉంది. నల్గొండ జిల్లాలో ఇక్కడ వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 12,000 ఎకరాలు ఉండగా.. కౌలు చెల్లించకుండా చాలా మంది రైతులు, స్థానిక నేతలు భూములను ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ భూములను ఆక్రమించి ఇళ్లు కట్టేయడం, ఇతర నిర్మాణాలు చేపట్టారు.
దేవుడి భూమి అక్రమార్కులకు వరంగా మారింది. దేవాదాయశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఆలయ భూములను అక్రమంగా లీజులకు ఇస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఆలయ భూములను వ్యవసాయం కోసమో, చిన్నపాటి అవసరాల కోసమో తక్కువ ధరకు లీజుకు తీసుకున్నవారు.. ఇప్పుడు ఆ భూములను దేవాదాయ శాఖకు తెలియకుండా థర్డ్ పార్టీలకు సబ్-లీజుకు ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆలయానికి సంబంధించిన భూమిని ఈవో ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ప్రతినెలా రూ.50 వేలకు పైగా కిరాయి వసూలు చేస్తున్నారని దేవాదాయశాఖకు ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు విచారణకు వెళ్లగా.. ఈ విషయం లీక్ కావడంతో ఆ ఈవో ల్యాండ్‌లో ఉన్న దుకాణాలను ఈవో ఆఫీస్ మార్చి వేశారు. ఖాళీ స్థలాన్ని ఈవో ఆఫీస్ గా వాడుకుంటున్నామని, ఎవరికీ లీజ్ ఇవ్వలేదని ఈవో చెప్పడంతో చేసేదేమి లేక వెనుతిరిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు వెలుగు చూస్తున్నా.. ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ శివార్లలోని ఓ ఆలయానికి చెందిన 5 ఎకరాల భూమిని ఒక వ్యక్తి ఏడాదికి రూ. 20 వేలకే లీజుకు తీసుకున్నాడు. కానీ, శాఖకు తెలియకుండా అందులో కమర్షియల్ గోదాములు కట్టించి, నెలకు రూ. 2 లక్షలు అద్దె వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్ము ఆలయ ఖాతాలోకి వెళ్లకుండా ఆ వ్యక్తి జేబులోకి వెళ్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి లీజును రెన్యువల్ చేయాలి లేదా పెంచాలి. కానీ, పలు జిల్లాల్లో 30-40 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న లీజు అగ్రిమెంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, క్షేత్రస్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.
ప్రతి ఆలయానికిపూర్తి వివరాలతో రికార్డు ఉంటుంది. భూమి వివరాలతో పాటు ఆదాయ మార్గాలు సైతం ఉంటుంది. అందులో ఆలయ ప్రారంభం నుంచి వివరాలు నమోదుతో ఉంటుంది. వాటిని ఎప్పకటిప్పుడు అప్ డేట్ చేయాలి. అందులో వివరాలను నమోదు చేస్తుండాలి. కానీ చాలా మంది ఈవోలు ఈ రిజిస్టర్లను అప్‌డేట్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ సర్వే చేస్తే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో, ఎవరు అక్రమంగా లీజుకు ఇచ్చారో తెలిసిపోతుందని భయపడుతున్నట్లు సమాచారం. అందుకే వివరాలు అడిగినా.. ఫైళ్లు దొరకడం లేదు.. కోర్టులో కేసులు ఉన్నాయని కాలయాపన చేస్తున్నారని ఉన్నతాధికారులే అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ఎప్పటివరకు వివరాలు ఇస్తారనేది మాత్రం సస్పెన్స్. అయితే నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ భూములకు డిజిటల్ సర్వే చేస్తే మాత్రం ఆలయ భూములను కాపాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి, ఆలయానికి ఆదాయం సైతం వస్తుంది.
Also Read: New Amrit Bharat Trains : చర్లపల్లి నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు, ఎక్కడి వరకు వెళ్తాయంటే?