Big Stories

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. వారిని నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు తీసుకెళ్లారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్ లో నిందితుల వాయిస్‌ రికార్డు చేశారు. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిల్స్‭ను ఎఫ్ఎస్ఎల్ అధికారులు తీసుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడిన ఆడియో, వీడియోల్లోని వాయిస్‭ను పోల్చి చూడనున్నారు. వాయిస్ టెస్ట్ తర్వాత నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహాయాజీను కస్టడీ కోసం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ లో విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం నిందితులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను సిట్‌ తెలుసుకునే పనిలో ఉంది. ఈ కేసులో రామచంద్రభారతి ఇచ్చే వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్ కీలకం కానుంది. నిందితుల వెనుక ఎవరున్నారనే అంశంపైనా సిట్‌ విచారణ చేస్తోంది. నిందితుల కాల్‌ డేటా,సెల్‌ఫోన్‌లో వీడియోల ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి , నందకుమార్‌ను సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుని రెండు రోజులుగా విచారిస్తున్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులపై ఆరా తీస్తున్నారు. కస్టడీ అనంతరం నిందితులను పోలీసులు కోర్టులో హాజరపరుస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News