Sam Bankman Fried : ఒకటీ, రెండూ కాదు… ఏకంగా లక్షా 20 వేల కోట్లు. అంటే ఓ రాష్ట్ర ఏడాది బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తం… కొన్ని గంటల వ్యవధిలో కరిగిపోయింది. అంత భారీగా సంపద కోల్పోయిన వ్యక్తి… శామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్. క్రిప్టోకరెన్సీ వర్గాలు అపరమేధావిగా భావించే ఫ్రైడ్… ఇంత సంపద పోగొట్టుకుని… టాక్ ఆఫ్ ద వరల్డ్ అయ్యాడు.
శామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ ఏర్పాటు చేసిన క్రిప్టో ఎక్స్ఛేంజీ FTX కుప్పకూలడంతో… గంటల వ్యవధిలోనే 14.5 బిలియన్ డాలర్లు… అంటే మన కరెన్సీలో దాదాపు లక్షా 20 వేల కోట్ల రూపాయల సంపద హారతికర్పూరం అయిపోయింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన FTXకు నగదు లభ్యత సమస్య తలెత్తిందన్న పుకార్లు షికార్లు చేయడంతో… ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా FTT, FTX టోకెన్‌లను తెగనమ్మేశారు. బ్యాంక్‌మన్-ఫ్రైడ్ ఎక్స్ఛేంజీని రక్షించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలగడంతో… ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన బినాన్స్‌లో కూడా అమ్మకాల వెల్లువ తప్పలేదు. దాంతో… బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో కూడా బ్యాంక్‌మన్-ఫ్రైడ్ తన స్థానాన్ని కోల్పోయారు. FTX కుప్పకూలక ముందు ఫ్రైడ్ సంపద విలువ దాదాపు 15.5 బిలియన్ డాలర్లు. FTXలో 53 శాతా వాటా కలిగిన ఫ్రైడ్… క్రిప్టో ఎక్స్చేంజీ పతనమవడంతో… గంటల వ్యవధిలోనే 94 శాతం సంపద పోగొట్టుకుని 991.5 మిలియన్ డాలర్ల సందపకే పరిమితమయ్యాడు. గత వారం రోజుల్లో FTX ధర 90 శాతానికి పైగా పతనమై 2.32 డాలర్లకు చేరింది.
క్రిప్టో ఎక్స్ఛేంజీ FTXను 2019లో స్థాపించాడు… బ్యాంక్‌మన్-ఫ్రైడ్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో మూడో స్థానంలో ఉండేది. క్రిప్టో వర్గాల్లో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన ఫ్రైడ్… 2014లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్లు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించి… 2019లో FTX ఏర్పాటు చేశారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రారంభంలో FTX విలువ 40 బిలియన్ డాలర్లు. కేవలం నెలల వ్యవధిలోనే అది పూర్తిగా పతనమైంది.