డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం దక్షిణ భారతంలో కాక రేపుతున్నది. తమకు అన్యాయం చేస్తే అస్సలు సహించేది లేదంటూ కేంద్రంలోని మోడీ సర్కారు మీద సౌత్ స్టేట్స్ భగ్గుమంటున్నాయి. నియోజకవర్గాల పెంపు(అసెంబ్లీ+ పార్లమెంటు)లో సమానంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం ఇప్పటికే హింట్ ఇవ్వగా.. ఆ విధానం వలన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అంటున్నాయి.దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడం వలన ఇక్కడ జనాభా తగ్గిందని, ఉత్తర భారతంలో ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకపోవడంతో అక్కడ జనాభా భారీగా పెరిగిందున అక్కడ సీట్లు పెరిగి, ఇక్కడ తగ్గుతాయని సౌత్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా దక్షిణాది అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు కొలువుదీరితే ఇక దక్షిణాది అవసరం కేంద్రానికి ఏమాత్రం ఉండదని ఆరోపిస్తున్నాయి.
డీలిమిటేషన్ మీద ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం మీటింగులో చర్చించిన కొన్ని అంశాల మీద మీడియాకు వివరించారు. కాంగ్రెస్ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని..డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. ఎందుకంటే దేశంలో ఇంకా జనగణన పూర్తవ్వలేదు. సెన్సస్ పూర్తయ్యాక ఆ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పట్టుబడుతున్నాయి. జనగణన పూర్తవ్వడానికి ఏడాదిన్నర సమయం పట్టొచ్చు.2029లో జమిలి ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే కేంద్రం హింట్ ఇచ్చింది. అలాంటప్పుడు సెన్సస్ పూర్తయ్యాక 2028 వరకు డీలిమిటేషన్ పూర్తి చేసి అప్పుడు ఎన్నికలకు వెళ్లాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నది. కానీ కేంద్రం మాత్రం అస్సలు వినకుండా ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అందులోనే మహిళా సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.
డీలిమిటేషన్ బిల్లుపై సీఎం రేవంత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, డీలిమిటేషన్ బిల్లుకు మాత్రం అస్సలు ఇవ్వబోదని క్లారిటీ ఇచ్చారు. ఆగమేఘాల మీద ఇప్పుడు బిల్లు తీసుకురావడం వెనుక కేంద్రం కుటిల రాజకీయాలు చేస్తున్నదని అన్నారు. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే డీలిమిటేషన్ బిల్లును త్వరగా తీసుకువస్తున్నారని, దాన్ని పాస్ అవ్వకుండా చూస్తామని వెల్లడించారు. రేవంత్‌కు మద్దతు తెలిపేందుకు సౌత్ స్టేట్స్ సైతం ముందుకు రానున్నట్టు చర్చ జరుగుతున్నది.ఈ విషయంలో సౌత్ స్టేట్స్ సహకారం కోరతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. అవసరమైతే మరో ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు.
కవితకు కేటీఆర్ పరోక్ష వార్నింగ్.. గులాబీ కోటలో రగులుతున్న రాజకీయం
ఇదిలాఉండగా, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏ పక్షాన నిలుస్తుందనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రభుత్వం బిల్లును వ్యతిరేకిస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరి బీఆర్ఎస్ ఆ బిల్లుకు మద్దతు ఇస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉన్నది. కాగా, రెండ్రోజుల కిందట కేటీఆర్ డీలిమిటేషన్ బిల్లుపై స్పందించారు. నియోజకవర్గాల పెంపునకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కానీ, కేంద్రం తీరుపై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.