అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఈసారి 3.24 లక్షల కోట్లతో ప్రజారంజక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏయే రంగాల వారీగా ఎంత కేటాయింపులు చేశామో ఆర్థికమంత్రి భట్టి సభలోని సభ్యులకు వివరించారు. కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన గతంలో కంటే ఈసారి జీఎస్టీ ఆదాయం తగ్గింది. వసూళ్లు పెరుగుతున్నా ఆదాయం మాత్రం తగ్గినట్టు తెలుస్తున్నది.రిజస్ట్రేషన్ల ఆదాయం సైతం తగ్గినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వాస్తవానికి దగ్గరగా ఉండే పద్దును తయారుచేయాలని సీఎం రేవంత్ ఆర్థికశాఖను ఆదేశించినట్టు తెలిసింది. సెషన్స్ ప్రారంభానికి ముందు రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్ష బీఆర్ఎస్ కర్తవ్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్.. గవర్నర్‌కు ధన్యవాద తీర్మానం తెలిపే సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసి అదే పనిగా అడ్డుకోవడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్, గాంధీ సరోవర్, సిటీలో ఎలక్ట్రిక్ బస్సులను పెంచడం, పరిశ్రమలను రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలోకి తరలించడం, భూ సేకరణ, భూదాన్ భూముల అంశం ఇలా దేనిని ప్రతిపక్షాలు వదలకుండా నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయని, ఇష్టానుసారంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని.. అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు.
గతంలో బీఆర్ఎస్ చేపట్టిన ప్రతిపనిని తమ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులే గానీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, కాంట్రాక్టర్లు, గ్రామపంచాయతీలకు నిధుల విడుదల, ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులు, విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించడం, గతంలో కాళేశ్వరం చేసిన అప్పులను వడ్డీతో కలిపి విడతల వారీగా చెల్లిస్తూ వస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బడ్జెట్‌లో సగానికి పైగా నిధులు, నెలలో రాష్ట్ర ఆదాయం నుంచి వడ్డీలు, అసలు కడుతున్నామని వెల్లడించారు. దీంతో అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల జీతాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు మంత్రులు సైతం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Narsaiah Biopic: ప్రజా నేత ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ నుంచి శివన్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్..
ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుభరోసా మరోసారి వేసేందుకు సర్కారు సిద్ధమైందని, ఈనెల 22న రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. అందుకోసం బడ్జెట్‌లో రూ.18వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా విషయంలో రాజీపడబోమని ఇటీవల సీఎం రేవంత్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు సన్నాలు పండించిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ సైతం అందించింది. బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా.. తమ పనిని తాము చేసుకంటూ వెళ్తామని ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేస్తున్నారు.