Tiger Attack: కంటికి కనిపించదు.. డ్రోన్లకు చిక్కదు.. కాని రక్తం మరిగిన పులి వెంటాడుతోంది. వేటాడుతోంది. అదును చూసి పంజా విసురుతోంది. బలి తీసుకుంటోంది. ఒకరి ప్రాణాలు మింగింది.. మరొకరు చావు బతుకుల మధ్య పోరాటం సాగిస్తున్నారు. రాకాసి పులి మ్యాన్ ఈటర్ గా మారిందా? కుమ్రంబీమ్ జిల్లాలో గాండ్రిస్తున్న పులిపై స్పెషల్ రిపోర్ట్
రక్తం రుచి మరిగిన పులి.. మళ్లీ మళ్లీ పంజా విసురుతోంది. కొద్దిరోజుల క్రితం కుమ్రం బీం జిల్లాలోని దుబ్బగూడలో సురేష్‌పై దాడి చేసిన టైగర్.. రాత్రి ఇటిక్యాల్ పహాడ్‌లో లేగదూడపై పంజా విసిరింది. కాబట్టి అది దుబ్బుగూడ నుంచి ఇటిక్యాల్ పహాడ్ వైపు వెళ్లిందని స్పష్టమవుతోంది. దీంతో ఇటిక్యాల్ పహాడ్ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటు వస్తుందో, ఎక్కడ మాటు వేసి పంజా విసురుతుందోనని బిక్కచచ్చిపోతున్నారు.
ప్రస్తుతం దానాపూర్ సమీపంలో చక్కర్లు కొడుతోంది. లెటెస్ట్‌గా ఓ మేకల మందపై దాడి చేసింది పెద్దపులి. ఓ మేకను కరుచుకొని వెళుతుండగా మేకల కాపరి ఒక్కసారిగా అరవడంతో అక్కడే వదిలేసి పారిపోయింది. పెద్దపులి దాడిలో మేక గాయపడింది. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని.. పులి కోసం గాలిస్తున్నారు.
ఇటిక్యాల్ పహాడ్‌ను పులి స్థావరంగా మార్చుకుందా!? ఇప్పుడు అందరిలోను ఇదే అనుమానం వ్యక్తమవుతోంది. అక్కడి నుంచే అటుఇటు తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తోందని భావిస్తున్నారు. అటు, అటవీ సిబ్బంది మాత్రం ఇటిక్యాల్ పహాడ్ దాటితే పులి గండం తప్పినట్టేనని అంచనా వేస్తున్నారు. అవతలివైపు మహారాష్ట్ర ఉంది కాబట్టి.. మనకు సమస్య ఉండదని లెక్కలేస్తున్నారు.
Also Read: కొమురం భీం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. మరో వ్యక్తిపై పులి దాడి
మరోవైపు ఏ నిమిషాన పులి పంజా విసురుతుందోనని స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రైతులు పంట పోలాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మేడ వెనక భాగంలో మాస్కులు పెట్టుకోవాలని.. మాస్క్ ఉంటే పులి దాడి చేయదంటున్నారు.
పులి దాడి నుంచి తప్పించుకోవాలంటే ఎలా? అనే అంశంపై స్థానికులకు కొన్ని సూచనలు చేస్తున్నారు అటవీ సిబ్బంది. కొన్నాళ్లు పొలాల్లోకి వెళ్లవద్దని రైతులకు చెప్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పనులు మానుకోవాలని కూలీలకూ సూచిస్తున్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన పులిని వీలైనంత త్వరగా బంధించి, ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే పులి మహరాష్ట్ర వైపు వెళ్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటిక్యాల్ పహడ్ దాటితే పులి గండం తప్పినట్టేనని అధికారులు బావిస్తున్నారు.