Tobacco Farmers: స్వేచ్ఛ, బ్యూరో: ఆరుగాలం శ్రమించి పొగాకు పండించిన పంటకు మార్కెట్లో నాణ్యత పేరుతో తిరస్కరణకు గురవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామంలో నారాయణ అనే రైతు కొనుగోలు కేంద్రంలో సరుకు తిరస్కరణకు గురవడంతో ఏకంగా పంట పొలంలోని పొగాకు నిప్పు అంటించాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా గద్వాల నియోజకవర్గాలలో కొన్ని మండలాలలో పొగాకు పంట సాగు చేస్తారు. వివిధ కంపెనీలకు చెందిన రకాలను 40 వేల ఎకరాలకు పైగా ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పేరుగాంచిన ఐటీసీ కంపెనీ సుక్క బర్లీ సాగుకు కంపెనీ ప్రతినిధుల ప్రోత్సాహంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. పంట ప్రారంభానికి ముందే రైతులతో కంపెనీ ప్రతినిధులు సమావేశమై పంట సాగుపై అవగాహన కల్పించడంతో పాటు కంపెనీ నిబంధనలను తెలుపుతారు. అనంతరం నారను పెంచుకునేందుకు విత్తనాలు ఇస్తారు.
60 రోజుల తర్వాత మొక్కలను పొలంలో నాటు వేస్తారు. అనంతరం కంపెనీ సిబ్బంది పంట సాగు విస్తీర్ణంపై సర్వే సైతం చేపడుతారు. అనంతరం పంట సాగుకు అవసరమైన సూచన,సలహాలు ఇస్తూ అందుబాటులో ఉంటారు. పంట నాణ్యతగా వచ్చేందుకు కసి మందులను రైతులకు అందుబాటులో ఉంచుతారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కూడా పంటకు బోర్ నీరు పెట్టకుండా వర్షాధారంగా పంట పండేలా సిబ్బంది పరిశీలిస్తుంటారు. అనంతరం మూడు నెలల తర్వాత ఆకు పరిపక్వతకు వచ్చాక పొగాకు దోర్నాలు సిద్ధం చేసి ఆరబెడతారు. ఈ దశలో సైతం సవాలక్ష కండిషన్ లు పాటించాల్సిందే. పొగాకు పైన టార్ఫాలిన్ లు కట్టి, వర్షం,ఎండ తాకకుండా జాగ్రత్త పడాలి. ఆకు పూర్తిస్థాయిలో ఎండిన తర్వాత తరచుగా మండెలు తిప్పడం ద్వారా ఆకు సిద్ధంగా ఉందని స్థానిక అధికారులకు రైతులు తెలుపుతారు.వారు ఆకు నాణ్యతను పరిశీలించి, నాణ్యత పై సంతృప్తి చెందిన అనంతరం ఇచ్చిన డేట్ కి మాత్రమే అమ్మేందుకు అలంపూర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న జల్లాపురం కొనుగోలు కేంద్రానికి రైతులు పంటను రవాణా చేసి తీసుకపోతున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆకు నాణ్యత చూసి రేటు వేసే ఆఫీసర్ తన ఇష్టానుసారంగా రిజెక్ట్ చేస్తున్నడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. కంపెనీలు సాగు చేసేటప్పుడు ఒక మాదిరి తీరా పంట చేతికి వచ్చి అమ్మే దశలో రేటు వేయకుండా సి.ఆర్ చేస్తున్నడంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టి నష్టం వాటిల్లడంతో స్థానికంగా రైతులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు పోటీగా.. థామ్సన్ 4K బాక్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
గత సంవత్సరం సైతం పంట సాగు చేసిన రైతులకు ఆశించిన మద్దతు ధర లభించింది. ఈసారి సైతం అదే నమ్మకంతో సాగుపై ఆసక్తితో పంటను సాగు చేశారు. ప్రస్తుతం కంపెనీలు పంటపై జిఎస్టి భరించాల్సి రావడంతో కంపెనీలు నాణ్యత పేరుతో సరుకు కొనేందుకు తిరస్కరిస్తున్నారని రైతులు తెలిపారు. వాస్తవానికి కంపెనీలు రైతులతో క్వింటాకు 16,500 చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 16500 కొనాల్సింది పోయి 4 వేలు నుంచి 12 వేల లోపు ఎక్కువ స్టాకు రేట్లు వేస్తూ కేవలం కొన్నింటికి మాత్రమే ఆశించిన స్థాయిలో ధరలు వేస్తున్నారని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కంపెనీలు చేస్తున్న దగాతో రైతులు, కౌలుకు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కంపెనీ ప్రతినిధుల సూచనతో పంటలు సాగు చేస్తున్నా,స్థానిక అధికారులు పర్యవేక్షణ ఉన్నా కొనుగోలు చేసే దశలో తరచుగా సి ఆర్ లు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
రైతులకు ఇచ్చిన పొగాకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా అధికారులు కుంటి సాకులు చెబుతూ బేళ్లను వెనక్కి పంపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆ కంపెనీ సిబ్బంది రైతు పండించిన పంటను పొగాకు ఎండబెట్టి మండే పెట్టి, పలుసార్లు మండేలు తిప్పిన తర్వాత సరుకు నాణ్యతగా ఉందని చేస్తున్నారు,డ్రై అయిన తర్వాత ఐటీసీ కంపెనీ ప్రతినిధి ఆమోదం మేరకు కొనుగోలు కేంద్రంలో సరుకు అమ్మేందుకు బేళ్ళు కడతారు. సరుకును రవాణా చేసి కేంద్రంలో అధికారులు కేవలం 30% మాత్రమే కొనుగోలు చేసి మిగతా వాటికి తేమశాతం ఎక్కువగా ఉందని,సక్రమంగా లేవని సాకులు చెబుతూ తిరిగి పంపిస్తున్నారు. ఒకే భూమిలో పండించిన ఒకే పంటకు నాణ్యత కొరవడిందంటూ తిప్పి పంపడం ఎంతవరకు సమంజసం అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ సరుకు ఏమి చేయాలో రైతులు దిక్కుతోచి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆకుపచ్చలు, ఆకు నల్లగా,తెల్లగా, ఆకు పగుళ్లు లేకుండా చింతపండు కలర్ ఉండి నూనె శాతం వచ్చేటట్లు మందంగా ఉంటేనే బయ్యర్లు ఆ చెక్కుకు రేటు నిర్ణయిస్తున్నారు. 10 బేల్లలో కేవలం ఒకటి, రెండింటికి మాత్రమే రేట్లు వేస్తూ మిగతా వాటిని తిరస్కరిస్తున్నడంతో బయింగ్ పాయింట్ కి రవాణాకు అధిక మొత్తంలో వెచ్చించి తీసుకుపోయి రిటన్ తీసుకోవాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది తనపై అధికారితో కలిసి పరిశీలించిన అనంతరమే సరుకును తీసుకపోతున్నా వాటిని సైతం రిజెక్ట్ చేస్తున్నడంతో రైతులు కల్లాల దగ్గరే నిలువ చేసుకుంటూ నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. పంట సాగు చేసిన రైతులు ఎక్కువ మొత్తంలో ఈసారి పంట కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తుండడంతో సరుకును ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
ఐటీసీ కంపెనీ తరఫున బర్లీ రకాన్ని రైతులు అధికంగా సాగు చేస్తారు. గతంలో కంటే ప్రస్తుతం విత్తనాలలో నాణ్యత లేక దిగుబడులు సైతం 6 క్వింటాలకు మించి రావడంలేదని రైతులు వాపోతున్నారు. కంపెనీ విత్తనం నాణ్యత లోపించి దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు తెలిపారు. కర్నూలు సమీపంలో ఇదే ఐటిసి కంపెనీకి చెందిన కొనుగోలు కేంద్రంలో 36 చెక్కులకు గాను కేవలం రెండు చెక్కులు మాత్రమే పాసు చేయడంతో రైతు తీవ్ర మనస్తాపానికి గురై అక్కడే పురుగు మందు తాగిన ఘటన చోటు చేసుకుందని రైతులు తెలిపారు. ఎల్కూరు గ్రామానికి చెందిన రైతు మూడుసార్లు కొనుగోలు కేంద్రానికి పొగాకు పంటను తీసుకెళ్లగా సి ఆర్ చేయడంతో రైతు ఆగ్రహంతో కొనుగోలు కేంద్రంలోనే చెక్కుకు నిప్పు అంటించాడు. స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పారని రైతులు తెలిపారు.
నేను నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాను. కంపెనీ సిబ్బంది సూచన మేరకు పంటను సాగు చేశాను. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పంటను పండించి జల్లాపురం కొనుగోలు కేంద్రంలో వేళ్ళు కొనడంలో కొర్రీలు వేస్తూ తొమ్మిది వేళలో కేవలం ఒక టీ మాత్రమే కొన్ని ఎనిమిది బేళ్లను సి ఆర్ జేశారు. కూలీలు ఇవ్వాలని సరుకు నాణ్యతను బట్టి తోచిన రేటును వేయాలని బయ్యర్ ను వేడుకున్నా కనికరించలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెంది ఆవేదనతో పండించిన పంటను పంట పొలంలోనే 12 క్వింటాళ్ల డోర్నాలకు నిప్పంటించాను. రైతుల పట్ల కంపెనీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రెండు లక్షల విలువగల సరుకుతో పాటు లక్ష విలువగల ద్విచక్ర వాహనం సైతం మంటల్లో కాలిపోయింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
Also Read: Dhurandhar 2: ధురంధర్ సినిమా సగం కలెక్షన్స్‌కు కారణం ఆ నటుడే అంట.. హీరో మాత్రం కాదు!