Heavy Rain Alert: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం వర్షం దంచికొట్టింది. సాయంత్రం నుంచి మొదలైన వాన.. రాత్రి తొమ్మిది గంటల నుంచి కుండపోతగా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్‌లో వాన పడింది. అర్థరాత్రి వరకు నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.45శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూశారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు..
అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
పగలు సూర్యుడు భగభగ.. రాత్రులు కుండపోత వానలు..
ఒక వైపు ఎండ, మరో వైపు వానలు కురుస్తున్నాయి. ఇటు ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వానలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సాయంత్రం తెలంగాణలో కుమ్ముడే కుమ్ముడు
గురువారం రోజూ కూడా హైదరాబాద్‌కు సాయంత్రం బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. సుమారు 5 నుంచి 6 గంటల సమయంలో నగరంలో మళ్లీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని అదికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే జనగామ, రంగారెడ్డి, ములుగు, కరీంనగర్, హైదరాబాద్, యాదాద్రి భూవనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో వాతావరణం ఇలా..
తెలంగాణతో పాటు ఏపీలో కూడా మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు రాయలసీమకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
Also Read: వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి..
ఈ జిల్లాల్లో కుండపోత వర్షం..
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు.. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.