Mahesh Kumar Goud: తెలంగాణ తల్లి విగ్రహాన్ని కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్. తెలంగాణ తల్లి విగ్రహం.. అచ్చం తెలంగాణ ఆడపడుచు, తల్లి మాదిరిగా ఉందన్నారు. నిజమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉందన్నారు.
దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దని సూచన చేశారు. రూపుదిద్దుకున్న తెలంగాణ విగ్రహం శాశ్వతంగా ఉండేలా అవసరమైతే చట్టం తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణకు సోమవారం (డిసెంబర్ 9) ప్రత్యేకమైన రోజుగా వర్ణించారు టీపీసీసీ చీఫ్.
ఒకటి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం రోజు, 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన రోజుగా ఇదేనని గుర్తు చేశారు. తెలంగాణలో ఇవాళ చరిత్రాత్మకమైన రోజుగా వర్ణించారు. రాష్ట్ర ప్రజల తరపున సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శానసమండలి ఆవరణంలో మీడియాతో మాట్లాడారాయన.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. వాస్తవాలు ప్రతిబింబించే విధంగా విగ్రహాలు రూపకల్పన చేయడం బాగుందన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా విగ్రహం ఉంది. ముమ్మాటికీ తెలంగాణ సంస్కృతికి దర్పణం పడుతుందన్నారు.
ALSO READ: తెలంగాణ తల్లి విగ్రహం, అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన..
బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి శిల్పి, తెలంగాణ ప్రకృతి, సంప్రదాయాలను ప్రతిబింబించారన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ రూపం మార్చకూడదు, అలా చేస్తే ప్రాముఖ్యత కోల్పోతుందన్నారు. టీఎస్ కంటే… టీజీ బాగుందని వెల్లడించారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంలో హస్తం ఆశీర్వదిస్తుందనే భావించాలన్నారు. సోనియాగాంధీ బర్త్ డే నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని అప్పట్లో పార్లమెంట్‌లో కోరామని గుర్తు చేశారు.