Telangana Cabinet : అదిగదిగో అనడమే కానీ.. అడుగు ముందుకు పడిందే లేదు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎప్పటికప్పుడు అడ్డంకులు. అంతకుముందెప్పుడో అన్నారు. ఆ తర్వాత ఉగాదికని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. మంత్రి ఉత్తమ్ పార్టీ పెద్దలకు తన జాబితా ఇచ్చి వచ్చారు. లిస్ట్ ఫైనల్ చేశారన్నారు. అంతలోనే జానారెడ్డి రాసిన లేఖ కలకలం రేపింది. ఆయన వల్లే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందన్నారు. మినిస్టర్ పోస్ట్‌పై బోలెడన్ని ఆశలు పెట్టకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పెద్దలు జానారెడ్డిపై భగ్గు మన్నారు. తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఆ తర్వాత మరో ఆశావాది ప్రేమ్‌సాగర్‌రావు సైతం ఎంపీ వివేక్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఇలా కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్నా కొద్ది.. కాంగ్రెస్‌లో కుంపటి రాజుకుంటూ వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం వార్నింగ్ ఇచ్చారు. గీత దాటి, నోరు జారితే వాళ్లకే నష్టం అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సద్దుమనిగినట్టు ఉంది. నేతలంతా సైలెంట్‌గా ఉన్నారు. ఇలాంటి సమయంలో.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఎప్పుడో చెప్పేశారు. మరి, ఈసారైనా…?
కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే..
వీలైతే మే నెల ఆఖరులో.. కుదిరితే జూన్ మొదటి వారంలో.. మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ బాస్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వివిధ సమీకరణాల వల్లే కేబినెట్ విస్తరణ జాప్యం జరుగుతోందని చెప్పారు. మంత్రిమండలితో పాటు.. ఈనెల 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం సైతం ఖరారయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ముఖ్యమంత్రిని మారుస్తారనేది కేవలం ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు.
కొండాకు అండ..
సీఎంను మార్చేంత సీన్ లేదు కానీ, కేబినెట్ విస్తరణలో సంచలనాలు ఏమైనా ఉంటాయా? అంటూ ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాజగోపాల్‌రెడ్డి నుంచి సుదర్శన్‌రెడ్డి వరకు.. పాత పేర్లే మళ్లీ కొత్తగా వినిపిస్తున్నా.. కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసు పెడతామని చెప్పారు. మంత్రులు అందరూ కలిసే ఉన్నారని.. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చెస్తున్నారని అన్నారు.
Also Read : హరీశ్‌రావుతో కేటీఆర్ భేటీలు.. భయపడ్డారా..?
కారులో మూడు ముక్కలాట..
ఇటీవల మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ముందు రచ్చ రచ్చ చేశారు. తమకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ బాగానే గొడవ చేశారు. ఆ వివాదంపైనా పీసీసీ చీఫ్ స్పందించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణమని, మహిళలకు కాంగ్రెస్‌లో ఉన్నంత ప్రాధాన్యం మరే పార్టీలో లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు, బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని.. హరీశ్‌రావు, కవితలు సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోందని అన్నారు.