Vallabhaneni Health: వైసీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని కేసులు వెంటాడుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో పీటీ వారెంట్ దాఖలవుతోంది. దీంతో వంశీ 95 రోజులుగా జైల్లోనే ఉండిపోయారు. తాజాగా వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదైంది. దాంతో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ వచ్చినా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ విషయంలో అయ్యో పాపం అనే వారే కనిపించడం లేదంటున్నారు.
95 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసుల్లో ఆయనకి బెయిల్ మంజూరవుతున్నా.. ఇంకా కేసులు పెండింగులో ఉండటంతో ఆయన జైల్లోనే గడపాల్సి వస్తోంది. వల్లభనేని వంశీ బెజవాడ జైల్లో 95 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో ఒకటి రెండు సార్లు జైలు నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత
ఇక తాజాగా వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యం అందించాలని కోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాదులు. గతంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందారని, ఇప్పుడూ అక్కడికే తీసుకెళ్లాలని పిటిషన్‌లో కోరారు న్యాయవాదులు. పిటిషన్ పై ఈరోజు విచారణ జరపనుంది కోర్టు. కోర్టు ఉత్తర్వులు వచ్చేవరకు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఖైదీల వార్డులో వైద్యం చేయనున్నారు డాక్టర్స్.
బెయిల్ వచ్చినా వంశీ జైలు నుంచి విడుదలయ్యో పరిస్థితి లేదు
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. అప్పటి నుంచీ ఆయన జైలులోనే ఉన్నారు. ఒక కేసు తరువాత ఒక కేసు వంశీ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తం వంశీపై 6 కేసులు నమోదు కాగా, 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉండటంతో ఆయన ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. ఆ కేసులో బెయిల్ వచ్చినా వంశీ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేకుండా పోయింది.
వైసీపీ శ్రేణుల నుంచి కూడా కరువైన సానుభూతి
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే చెలరేగిపోయారు. పార్టీ అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు అక్రమాలు, దౌర్జన్యాలు. ఇప్పుడా పాపాలన్నీ ఒకే సారి పండుతున్నాయా అన్నట్లుగా ఆయనపై కేసులు నమోదౌతున్నాయి. చివరికి ఆయన సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం వంశీ పరిస్థితి పట్ల ఇసుమంతైనా సానుభూతి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. వంశీని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు, హాస్పటల్‌కి తీసుకెళ్లినప్పుడు ఆయన సతీమణి, నలుగురైదుగురు అనుచరులు మినహా పలకరించడానికి కూడా ఎవరూ రావడం లేదంటున్నారు. ఇదంతా వంశీ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం సాధారణ జనం నుంచి వైసీపీ క్యాడర్ వరకూ వ్యక్తం అవుతోంది.
గన్నవరంలో టీడీపీ నాయకులే లక్ష్యంగా దాడులు
రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి ఆ పార్టీ కష్ట కాలంలో ఉండగా కాడె వదిలేసి వైసీపీ పంచన చేరిన వంశీ.. అలా చేరి ఊరుకోకుండా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లు రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.
సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కైన వంశీ
ఓటమి తరువాత వంశీ నియోజకవర్గానికి ముఖం చూపించిన పాపాన పోలేదు. అసలు దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్నట్లు వ్యవహరించారు. అయితే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మళ్లీ రంగంలోకి దూకారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అక్కడే అడ్డంగా బుక్కై అరెస్టయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయన కటకటాల వెనుకే ఉన్నారు.
ఇప్పటికే వంశీపై ఆరు కేసులు నమోదు
అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిలు వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయనపై ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి.. వాటితో సదరు ఇంటి కబ్జాకు సహకరించారన్న కేసు, అలాగే 2019 ఎన్నికల సమయంలో వంశీ ఓ పోలింగ్ బూత్ వద్ద చేసిన హంగామాకు సంబంధించిన కేసు ఆయనపై నమోదయ్యాయి. ఇలా వంశీపై ఇప్పటికే మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు కేసుల్లో వంశీకి బెయిలో, ముందస్తు బెయిలో లభించింది.
నకిలీ ఇళ్లపట్టాల పంపిణీపా మరో కేసు నమోదు
ఇక గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన బెయిలు పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసులో కూడా వంశీకి బెయిలు వస్తే ఇక ఆయన విడుదలే అని అంతా భావించారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులూ వంశీ విడుదల ఖాయమన్న ఆశాభావంతో ఉన్నారు. అంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై వంశీపై నమోదైన కేసులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానికి నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో బెయిలు వచ్చినా విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి.
2019 అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ స్టేషన్ లో వంశీపై కేసు
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఈ నెల 19లోగా కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశిం చింది. వాస్తవానికి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో 2019 అక్టోబరు 18న హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో వల్లభనేని వంశీ సహా 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ దాన్ని అప్పట్లో గోప్యంగా ఉంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలల పాటు ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో రహస్య విచారణ నిర్వహించి ఆధారాలు సేకరించారు.
పీటీ వారెంట్‌కు అనుమతిచ్చిన నూజివీడు కోర్టు
ఈ నేపథ్యంలో వంశీ టీడీపీ నుంచి వైసీపీ పంచన చేరారు. దాంతో కేసు నీరుగారిపోయింది. వంశీతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా, మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించి, అభియోగపత్రం దాఖలు చేశారు. తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో పోలీసులు కేసు పునర్విచారణ ప్రారంభించారు. ఆధారాలు లభించడంతో వంశీ పేరును తిరిగి చేర్చారు. దానికి సంబంధించి కోర్టు పిటీ వారెంట్ జారీ చేసింది.
అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ ఫిర్యాదు
అది చాలదన్నట్లు వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయంటున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదైంది. దీనిపైన గన్నవరం పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేయనున్నారు.
వంశీ జైలుకొచ్చినప్పుడు పరామర్శించి వెళ్లిన జగన్
మొత్తానికి వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. వంశీ వరుస కేసులతో జైళ్లోనే ఉంటున్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నా అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు. వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లిన జగన్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. వంశీ ప్రియమిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని ముంబైలో శస్త్ర చికిత్స తర్వాత అసలెక్కడ ఉన్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు . వైసీపీ నేతలు కూడా వంశీని మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి గన్నవరం మాజీ ఎమ్మెల్యే జైలు గోడల మధ్య నుంచి ఎప్పుడు బయటపడతారో?