KTR-HarishRao : హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. 2 గంటల పాటు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనారోగ్యంగా ఉన్న హరీశ్ తండ్రి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదీ న్యూస్. పైపైన చూస్తే ఇది రొటీన్ అంశమే కావొచ్చు కానీ, లోలోన చాలానే మేటర్ ఉందని అంటున్నారు. బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు నడుస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్, హరీశ్‌రావు, కవితల మధ్య ట్రయాంగిల్ వార్ జరుగుతోందని అంటున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ స్వయంగా హరీశ్‌రావు ఇంటికి వెళ్లడం మామూలు విషయమైతే కాకపోవచ్చు.
హరీశ్‌రావు దారెటు?
ఇటీవలి వరంగల్ బీఆర్ఎస్ సభలో హరీశ్‌రావును అధినేత పట్టించుకోలేదని అంటున్నారు. అలిగిన అల్లుడు, తనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్తున్నారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై హరీశ్ సైతం లేటెస్ట్‌గా స్పందించాల్సి వచ్చింది. తాను కేసీఆర్ మాటకు కట్టుబడి ఉంటానని.. కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే సహకరిస్తానని చెప్పుకొచ్చారు. అంటే, కేటీఆర్ ఆధిపత్యానికి హరీశ్ తలొగ్గినట్టేనని అంటున్నారు. హరీశ్ రావు స్టేట్‌మెంట్ పరోక్షంగా కవితకు సైతం చెక్ పెట్టిందని విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్‌లో కవిత కలకలం
కవిత ఇటీవల మంచి ఫైర్ మీదున్నారు. తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని అంటున్నారు. ఆర్నేళ్లు జైల్లో ఉన్నా సరిపోదా? తనను ఇంకా కష్టపెడతారా? అంటూ ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల వెనుక ఎవరు ఉన్నారో తెలుసని.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానంటూ హెచ్చరించారు. కవిత టార్గెట్ కేటీఆరే అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కవితను బీఆర్ఎస్ బాగా దూరం పెట్టింది. అదే సమయంలో జాగృతితో కవిత జోరు పెంచారు. బీసీ నినాదం, సామాజిక తెలంగాణ స్లోగన్స్‌తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కవిత తీరు పార్టీకి, కేటీఆర్‌కు చాలా ఇబ్బందిగా మారింది.
ట్రయాంగిల్ వార్!
కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్, హరీశ్, కవితలు మూడు భిన్న ధృవాలుగా మారి.. కారు పార్టీని మూడు ముక్కలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సడెన్‌గా రేసు నుంచి హరీశ్‌రావు సైడ్ అయ్యారు. కేటీఆర్‌కు జై కొట్టారు. బహుషా, అందుకేనేమో గతంలో ఎప్పుడూ లేనిది.. బావ ఇంటికి వెళ్లారు బావమరిది. హరీశ్‌కు థ్యాంక్స్ చెప్పారేమో. తమ మధ్య విభేదాలు లేవని కేడర్‌కు సిగ్నల్ ఇవ్వడానికే కేటీఆర్ ఇలా చేశారని చెబుతున్నారు. కేటీఆర్‌కు హరీశ్‌రావు అంటే భయం పట్టుకుందని.. పనిలో పనిగా అలిగిన బావను కూల్ చేసి ఉంటారని అంటున్నారు.
Also Read : కాంగ్రెస్‌లో కొండా సురేఖ కాక..
కాంగ్రెస్ కౌంటర్
కాంగ్రెస్ సైతం ఇలాంటి అనుమానమే వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్‌లో ముసలం మొదలైందని.. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అన్నారు. గతంలో హరీశ్ రావు ఇంట్లో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉందని.. ఇప్పుడు సడన్‌గా కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలన్నారు. హరీశ్‌రావు, కవితలు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోందని.. రాజకీయ ఆధిపత్యం కోసం కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని చెప్పారు. హరీశ్‌రావుతో చర్చల మతలబు ఏమిటో కేటీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్.