
Hyderabad latest news(Today news paper telugu):
భారీ వర్షాలు హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పంజాగుట్ట నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మైత్రీవనం, మూసాపేట మెట్రోస్టేషన్ వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. టోలీచౌకిలో ప్రధాన రోడ్లు మునిగిపోయాయి. ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వర్షాల బీభత్సానికి కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. బోరబండలో వరదకు మ్యాన్‌హోల్‌లో బైక్ కొట్టుకు వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది దాన్ని బయటకు తీశారు.మల్కాజ్ గిరి ప్రాంతంలోని అనేక కాలనీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. టూవీలర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి.
మేడ్చల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వానలతో గుండ్లపోచంపల్లి పరిధిలోని మైసమ్మగూడ జలదిగ్భంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ఇక పలు హాస్టళ్లు నీట మునగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మైసమ్మగూడ చుట్టపక్కల చాలా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో వేలాది మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరంతా సమీపంలో ఉన్న హాస్టళ్లలో ఉంటున్నారు. మొదటి అంతస్తు నీట మునగడంతో అందులో ఉండే విద్యార్ధులు అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. హాస్టల్‌లో చిక్కుకుపోయిన వారిని పోలీసులు జేసీబీల సాయంతో రక్షించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మల్లెపల్లిలో పచ్చకామెర్లకు చికిత్స చేసే ఓ ప్రైవేట్ ఆస్పత్రి నీట మునిగింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. జోనల్ కమిషనర్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలశయాల గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్‌లను ఆదేశించారు.
భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నారు. అత్యవసర ఉద్యోగులు మాత్రం పరిస్థితుల చూసుకుని బయటకు రావాలని పోలీసులు సూచించారు.
Revanth Reddy : కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్.. రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు..