Municipal Commissioners Transfers: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా 40 మంది మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారంలోగా బదిలీ చేసిన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ 40 మంది మున్సిపల్ కమిషనర్లు బుధవారమే కొత్త కార్యాలయంలో బాధ్యతలు తీసుకోవాలి.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదీల ప్రక్రియ కొనసాగుతోంది. చాలా శాఖల్లోనూ అధికారులకు స్థానచలనం కలుగుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలోకి 395 మంది ఎంపీడీవోలను సర్కార్ వేరే చోటుకి పంపింది. అలాగే ఎక్సైజ్ శాఖలోనూ భారీగా బదిలీలు జరిగాయి.
మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయి. ఈసీ మార్గదర్శకాలతో ప్రభుత్వం 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు స్థాన చలనం కల్పించింది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ సర్కార్ 40 మంది మున్సిపల్ కమిషర్లను బదిలీ చేసింది.
Read More: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ..
రానున్న రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారులకు స్థానచలనం జరిగే అవకాశాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఎన్నికల విధులకు అనుబంధంగా ఉండే శాఖల్లోకి అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.