– జైనూర్‌లో 3 మండలాల ఆదివాసీల ధర్నా
– నిందితుడి ఇంటివైపు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
– షాపులకు నిప్పు పెట్టే ప్రయత్నం.. తీవ్ర ఉద్రిక్తత
– బాధితురాలిని పరామర్శించిన మంత్రి సీతక్క
Tribal Woman: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, ఆదివాసీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. మహిళపై హత్యాచారానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ మగ్దూమ్ ఇంటివైపు వెళ్లేందుకు ఆదివాసీలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొందరు దుకాణాలు తగులబెట్టేందుకు చూశారు. ఫర్నీచర్ తగులబెట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..!
ఈనెల 1న జైనూర్ మండలానికి చెందిన ఆదివాసీ మహిళ, సోయంగూడకు వెళ్లేందుకు ఆటో ఎక్కగా డ్రైవర్ మగ్దూమ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడు. రాగాపూర్ దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె ముఖంపై బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచాడు. ఆమె పుస్తెల తాడు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితుడి అరెస్ట్.. రిమాండ్
ముందు యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు, మంగళవారం బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు మగ్దూమ్‌ను గుర్తించి పట్టుకున్నారు. అతడిపై అత్యాచారయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
Also Read: Jagan Serious: చంద్రబాబు ఇల్లు మునుగుతదనే బుడమేరు గేట్లు ఎత్తారు.. అందుకే ఈ పరిస్థితి: జగన్
బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు
ఈ ఘటనపై ఆదివాసీలు భగ్గుమన్నారు. మగ్దూమ్‌కు ఉరిశిక్ష విధించాలని నిరసనలకు దిగారు. 3 మండలాలకు చెందినవారు ధర్నాలు చేపట్టారు. బుధవారం ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. జైనూర్ మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడి ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
మంత్రి పరామర్శ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి సీతక్క పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. మహిళలపై ఎవరు దాడికి పాల్పడినా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు మంత్రి. బాధితురాలికి అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందజేస్తామని స్పష్టం చేశారు.