TS Cabinet Meeting Postponed: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం సాయంత్రమే మంత్రివర్గం సమావేశమై.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సీఎస్ కూడా అజెండాను సిద్ధం చేశారు. కానీ.. కేబినెట్ భేటీకి ఈసీ నుంచి అనుమతి రాలేదు. దాంతో 7 గంటల వరకూ సచివాలయంలోనే అనుమతి కోసం ఎదురుచూసిన సీఎం, మంత్రులు వెనుదిరిగారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ కేబినెట్ భేటీకి అనుమతివ్వలేదు. ఈసీ నుంచి పర్మిషన్ వచ్చాకే కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శనివారం నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీలో.. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటలకు సంబంధించిన ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం అజెండా రెడీ చేసుకుంది. కానీ.. ఈసీ నుంచి అనుమతి లేకపోవడంతో ఆయా సంక్షేమాలు, అత్యవసర అంశాలపై చర్చించలేకపోయినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం లోగా ఈసీ నుంచి కేబినెట్ భేటీకి అనుమతి రాని నేపథ్యంలో.. మంత్రులతో కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అడుగుతామని చెప్పారు.
Also Read: ఇక నుంచి TS కాదు TG.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం!
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం. అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు పదేళ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని సీఎం నిర్ణయించారు. కేబినేట్ భేటీ వాయిదా పడటంతో వీటిపై చర్చ జరగలేదు. కాగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాటు.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న ఉండటంతో కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతించలేదని సమాచారం.