TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌లో పందకు పైగా మార్కులొచ్చాయి. పోలీసుల ముందు కూర్చోబెట్టి రాపిస్తే 5 మార్కులు కూడా రాలేదు. TSPSC పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తు స్పీడప్ చేసిన సిట్.. తవ్విన కొద్దీ లింకులు బయట పడుతున్నాయి. ఇప్పటివరకు 47 మందిని అరెస్టు చేశారు. ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయి? అసలేం జరిగింది?
TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంలో డొంక కదులుతూనే ఉంది. అరెస్టుల సంఖ్య హాఫ్ సెంచరీకి చేరిందంటే ఇదెంత పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈసారి గచ్చిబౌలిలోని విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్న నర్సింగరావును అదుపులోకి తీసుకున్నారు. పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్. బోర్డు కాన్ఫిడెన్షియల్ రూంలోని కంప్యూటర్ నుంచి వేర్వేరు ప్రశ్నా పత్రాలు కోట్టేసిన ప్రవీణ్, AEE సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నాపత్రాలను నర్సింగ్ రావుకు అమ్మినట్టుగా విచారణలో తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. నర్సింగరావు మరికొందరికి ఈ పేపర్లను అమ్మినట్లు గుర్తించారు. వారి ఖేల్ ఖతం చేసే పని మొదలైంది.
మరోవైపు రెండు రోజుల క్రితం అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్లను అమ్మిన వరంగల్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ రమేశ్‌ను సిట్ అరెస్టు చేసింది. రిమాండ్‌కు తరలించారు. రమేశ్ 20 మందికి పేపర్లను అమ్మినట్లు గుర్తించారు. నలుగురిని రిమాండ్ చేశారు. మరో 10 మందిని అరెస్టు చేసే ఏర్పాట్లలో ఉన్నారు. వరంగల్‌కు చెందిన డీఈఈ రమేశ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో అతని బంధువు రవికిశోర్, బావమరిది విక్రమ్, మరదలు దివ్య కూడా ఉంటున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని SPDCLలో రవికిశోర్ జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోనే పేపర్ లీకేజీ కేసు నిందితుడు సురేశ్ కూడా ఉండేవాడు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ద్వారా లీకైన పరీక్ష పేపర్లను రమేశ్, రవికిశోర్ కొన్నారు. విక్రమ్, దివ్య డీఏవో పరీక్ష రాశారు. వారితో పాటు ఉప్పల్‌కు చెందిన భరత్ నాయక్, వరంగల్‌కు చెందిన రోహిత్ కుమార్, సాయిమధు, సతీశ్ కుమార్ ఏఈఈ పేపర్లు కొని పరీక్ష రాశారు. వారందరినీ సిట్ అధికారులు రిమాండ్‌కు తరలించారు. రమేశ్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా పనిచేస్తూనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసేవారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. 20మందికి పైగా అభ్యర్థులు రమేశ్ తో కాంటాక్టులో ఉన్నారు. ఏఈఈ పరీక్షకు రెండ్రోజుల ముందు మాస్టర్ పేపర్ సురేష్ చేతికి అందింది. దాన్ని రమేశ్, రవికిశోర్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. సైదాబాద్‌లో జిరాక్స్ తీసుకున్నారు. వాటిని 2 లక్షల నుంచి 3 లక్షల చొప్పున విక్రయించారు. రవికిశోర్ మరికొందరికి పేపర్లను అమ్మినట్లు గుర్తించారు.
పేపర్ లీక్ చేసి పరీక్షలు రాసిన అనుమానితులను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పేపర్లు కొని పరీక్ష రాసిన వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల సమక్షంలో పరీక్ష రాసినవారు.. కనీసం ఐదు ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయలేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ఏకంగా 100 పైగా మార్కులు రావడంపై అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. పేపర్ లీకేజీ విషయం బయటపడ్డ తరువాత కొంతమంది అభ్యర్థులు నేరం అంగీకరిస్తున్నట్లు సిట్ చెప్తోంది.