Big Stories

Tummala: తుమ్మల షాక్?.. ఎటు వెళ్లే ఛాన్స్?

Tummala: తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో సీనియర్ మోస్ట్ లీడర్. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. ఉన్నా లేనట్టే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోవడం.. ఎమ్మెల్సీ కావాలని అడిగినా.. ఏ పదవి ఇవ్వకపోవడంతో కేసీఆర్ మీద తీవ్ర అసహనంతో ఉన్నారని అంటారు. ఇక, ఖమ్మం గులాబీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. మంత్రి అజయ్ తో కోల్డ్ వార్.. తుమ్మలకు పార్టీలో ముల్లులుగా మారాయని చెబుతుంటారు. అందుకే ఎప్పుడు ఫిరాయింపుల ప్రస్తావన వచ్చినా.. తుమ్మల జంప్ అంటూ ప్రచారం జరిగిపోతుంటుంది. ఆయన మాత్రం ఏనాడు తన అసంతృప్తిని, అసహనాన్ని బయటపెట్టలేదు. నిండు కుండలా గమ్మున ఉంటూ వస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితుడైన ఆయన.. ఇప్పుడు గులాబీ బాస్ ను కలిసి ఎన్నాళ్లైందో.

- Advertisement -

అలా ఒంటరిగా, ఏ పదవీ, పలుకుబడి లేకుండా రాజకీయ నేతలు ఎంతోకాలం ఉండలేంటారు. ఒకసారి అధికార దర్పం అలవాటయ్యాక.. ఎలాంటి హడావుడీ లేకుండా ఉండటం చాలా కష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు సైతం పునరాలోచనలో పడ్డారని ఆయన సన్నిహితుల మాట. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ లో ఎలాంటి పదవులు వచ్చే అవకాశం లేదనే అనుమానంతో.. తన రాజకీయ ప్రస్థానాన్ని అప్పుడే ముగించే ఉద్దేశం లేక.. తనకు కలిసొచ్చే దారి చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా, వాజేడులో ఆత్మీయ సమావేశం పేరుతో తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో భారీ సమావేశం నిర్వహించడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.

- Advertisement -

పైకి ఆత్మీయ సమావేశమనే చెబుతున్నా.. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని అంటున్నా.. లోలోన మాత్రం ఏదో జరుగుతోందనే అంటున్నారు. టీఆర్ఎస్ లో కొనసాగాలా? వద్దా? అంటూ తన అనుచరులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే.. తుమ్మల లాంటి సీనియర్ నేత పార్టీని వీడితే.. గులాబీ దళానికి అది పెద్ద షాకే అవుతుంది.

తుమ్మల కారు దిగితే.. ఏ పార్టీ కండువ కప్పుకుంటారనేది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదంటున్నా.. తను ఎమ్మెల్యేగా గెలవడానికి పార్టీతో పని లేదనే అభిప్రాయంలో ఉన్నారట. ఒకవేళ టీడీపీ కాదనుకుంటే.. కుదిరితే కమలం.. కాదంటే కాంగ్రెస్ అంటున్నారు. తుమ్మల లాంటి పెద్ద నాయకులు వస్తానంటే.. ఏ పార్టీ కూడా వద్దనకపోవచ్చు. రెడ్ కార్పెట్ పక్కా. అయితే, చివర్లో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి.. మనం మనం.. పాతతరం అంటూ మచ్చిక చేసుకుని, తుమ్మల మనసు మార్చేసే అవకాశమూ లేకపోలేదంటున్నారు. అప్పటివరకూ, ఏదో ఒకటి జరిగే వరకు.. తుమ్మల టాపిక్ బ్రేకింగ్ న్యూసే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News