TG Municipal Elections: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు– 2023లో హస్తానికి షాక్ ఇచ్చిన అర్బన్ ఓటర్లు.. ఈ దఫా ఏ పార్టీ వైపు నిలుస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల కు భిన్నంగా ఈ సారి ఓటింగ్ జరుగుతుందా? లేదా? అని పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే పార్టీ భవితత్వం అంటూ టీపీసీసీ నుంచి అన్ని జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అర్బన్ ఓటర్ల తీర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ సెగ్మెంట్ లలో మెజార్టీ ఓటర్లు గులాబీ పార్టీ వైపు నిలిచారు. రూరల్ పబ్లిక్ ఓట్ షేర్ తోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే రెండేళ్ల తర్వాత నైనా అర్బన్ ఓటర్ల తమ వైపు నిలుస్తారనే ధీమాతో కాంగ్రెస్ ఉన్నది. ప్రభుత్వం పథకాలు అమలు, పార్టీలో నామినేటెడ్ పదవులు వంటివన్నీ కాంగ్రెస్ కు మైలేజ్ ను తీసుకువస్తాయనే భరొసాతో పార్టీ పెద్దలు ఉన్నారు. అంతేగాక అర్బన్ ఏరియాల్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా భారీగానే నిర్వహించామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థలకు (7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు) ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు తమకు సెమీ ఫైనల్స్ అంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వం కూడా చెప్తున్నది. దీంతోనే ఎన్నికల పై అగ్రనేతలు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్ధుల వ్యూహాలకు చెక్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ‘కారు’ వైపు మొగ్గు చూపిన పట్టణ ఓటర్లు,ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది.పైగా మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనకు ఒక ‘రెఫరెండం’గా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక గీటురాయి. మరోవైపు, తమకు పట్టున్న పట్టణ ప్రాంతాల్లో తిరిగి సత్తా చాటాలని బీఆర్ఎస్, తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అర్బన్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని అధికార పార్టీలోనూ ఆందోళన నెలకొన్నది.
Also Read: cold wave: మంచు దుప్పటిలో ఉమ్మడి మెదక్.. రహదారులపై వాహనదారుల అవస్థలు
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా కనిపిస్తోంది. సుమారు 52.42 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 26.80 లక్షలు మహిళలు, 25.62 లక్షల మంది పురుషులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న 2,996 వార్డుల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే దాదాపు 1.18 లక్షలు ఎక్కువగా ఉంది. ఇది అభ్యర్థుల గెలుపోటములను శాసించనుంది. ఇందులో 18–19 ఏళ్ల మధ్యస్తులు ఏకంగా 5.45 లక్షల మంది ఉండటం గమనార్హం. మరోవైపు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల అంచనాలకు యూత్, మహిళా ఓటర్ల అంచనాలు అందడం లేదని స్వయంగా సర్వే సంస్థలే చెప్తున్నాయి. మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం), గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలు అమలు చేస్తునప్పటికీ, మహిళా ఓటర్లపై ఈ స్కీమ్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఈ ఎన్నికల్లో తేలిపోనున్నది. ఇక నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల భర్తీ, స్కిల్ యూనివర్సిటీ వంటి అంశాలపై యువత ఎటువైపు మొగ్గు చూపుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. పట్టణ ప్రాంతాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం అభ్యర్థులకు సవాలుగా మారింది. సాధారణంగా పట్టణ ఓటర్లు మౌనంగా ఉంటూ, పోలింగ్ రోజున తమ ప్రభావాన్ని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఏ పార్టీకి అండగా నిలుస్తారనేది సస్పెన్స్ గా మారింది.
Also Read: Minister Ponguleti: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మంత్రి పొంగులేటి