BRS Politics: బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ బూమరాంగ్ అవుతోందా? నోరు జారి కేటీఆర్ ఇరుకునపడ్డారా? యూరియా ఎవరిస్తే వారికే ఉపరాష్ట్రపతి ఎన్నికలో మా మద్దతు ఉంటుందని ఓపెన్‌గా ప్రకటన చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఈ లెక్కన బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందా? బీజేపీ వైపుకి వెళ్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాజకీయాల్లో అడుగులు జాగ్రత్తగా వేయాలి. తేడా వస్తే నామరూపాలు లేకుండా పోతాయి పార్టీలు. ట్రెండ్‌కు తగ్గట్టుగా దూకుడు రాజకీయాలు చేస్తే ఇరుకునపడతారు. ముఖ్యంగా జాతీయ పార్టీలతో పొలిటికల్ గేమ్ ఆడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తేడా వస్తే మునిగిపోతారు కూడా. ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి కూడా అంతే.
దేశంలో యూరియా కొరత వెంటాడుతున్న విషయం కేటీఆర్‌కు ముందే తెలుసు. ఇప్పట్లో తెలంగాణకు యూరియా రాదని డిసైడ్ అయ్యారు.. రాజకీయ గేమ్ మొదలుపెట్టారు. ప్రజల్లో తన ఇమేజ్‌ని రెట్టింపు చేయాలని ప్రయత్నాలు చేశారు. చివరకు యూరియాపై సోమవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణకు 8,100 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం ప్రకటనతో ఒక్కసారిగా షాకయ్యారట కేటీఆర్. యూరియా పేరుతో ఉపరాష్ట్రపతి ఎన్నికలో గేమ్ ఆడాలని భావించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చివరకు ఆయనకు దెబ్బ కొట్టింది.
ALSO READ: యూరియా కొరతకు ఫుల్‌స్టాప్.. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆనందం
యూరియా కొరతపై రాష్ట్రాలు ఏమీ చేయలేవు. యూరియాను కేంద్రమే కేటాయిస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో మాట్లాడి కొరత లేకుండా చేసుకుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. అందువల్లే యూరియాపై కేంద్రం ప్రకటన చేసిందని కాంగ్రెస్ వాదన.
ఇంతవరకు బాగానే ఉంది. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు ఎటువైపు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమి అభ్యర్థి, తెలంగాణ వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇస్తారా? లేకుంటే ఎన్డీయే బలపరిచిన రాధాకృష్ణన్‌కు ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
యూరియా విషయంలో జాతీయ పార్టీలు చేసిందేమీ లేదని, మా పార్టీ ఒత్తిడి వల్లే యూరియా కేటాయించిందని బీఆర్ఎస్ సరిపెట్టుకుంటుందా? ఆ పాయింట్ మీద ఈ ఎన్నికకు దూరంగా ఉన్నామని, తటస్థ రాజకీయాలు మొదలు పెడుతుందా? అన్నది చూడాలి. ఎటుచూసినా బీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ గేమ్ ప్రజలకు అర్థమైందని అంటున్నారు నేతలు.
ఈ సమస్యను మరుగున పెట్టేందుకు కొత్త అస్త్రాన్ని రెడీ చేస్తోందట బీఆర్ఎస్. దాని ద్వారా రాజకీయాలు చేయాలన్నది ప్లాన్‌గా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. రేపో మాపో స్థానిక ఎన్నికల గంట మోగనుంది. అంతకుముందు ఏదోవిధంగా హైలైట్ కావాలన్నది కేటీఆర్ ప్లానని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.