Anushka Shetty: సాధారణంగా స్టార్ హీరోలు ఎక్కడైనా షూటింగ్ చేస్తున్నారు అని తెలిస్తే అక్కడకు అభిమానులు కుప్పలు తెప్పలుగా వస్తారు. తమ అభిమాన హీరోను కళ్లారా చూడడం కోసం రోజు మొత్తం కాళ్లు నొప్పులు వచ్చినా.. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉంటారు. అంతేనా పోలీసులు లాఠీలతో కొడుతున్నా పట్టించుకోకుండా హీరో ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటారు. అంత అభిమానం కేవలం హీరోలకు మాత్రమే సొంతం అనుకుంటే పొరపాటే.
హీరోల కోసమే కాదు.. హీరోయిన్ల కోసం కూడా లాఠీ ఛార్జ్ లు జరిగాయి. అప్పట్లో మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లాంటి హీరోయిన్లను చూడడం కోసం ఊర్లు ఊర్లు షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చేవి అంట. వారందరిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసేవారట. ఆ హీరోయిన్లకు అంత ఫాలోయింగ్ ఉండేది. ఇక ఇప్పుడు అంతే ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి. యోగా టీచర్ నుంచి హీరోయిన్ గా మారిన స్వీటీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
మిగతా హీరోయిన్లందరూ వేరు.. స్వీటీ ఒక్కతే వేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక స్వీటీ ఫాలోయింగ్ గురించి, ఆమె రేంజ్ గురించి నిర్మాత రాజీవ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనుష్క ఘాటీ అనే మూవీ చేస్తున్న విషయం తెల్సిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత సెప్టెంబర్ 5 న ఘాటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై హైప్ ను పెంచేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత రాజీవ్ రెడ్డి.. అనుష్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పుకొచ్చాడు. “ఘాటీ షూటింగ్ సగభాగం ఒడిస్సాలో జరిగింది. అక్కడ అనుష్క సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి, ఆమెను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. కొన్నిసార్లువారిని కంట్రోల్ చేయడానికి పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించాం. ఒడిస్సాలో కూడా అనుష్కకు ఉన్న ఫాలోయింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వార్త విన్న అభిమానులు.. అది స్వీటీ రేంజ్.. ఆమె ఎక్కడున్నా.. ఎంత గ్యాప్ ఇచ్చినా ఆమెకున్న క్రేజ్ తగ్గదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఘాటీ సినిమాతో స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.