Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి రాజకీయ తుపాను మొదలైంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుందని చెబుతూ, ఘనంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు వివాదాల తుఫానులో చిక్కుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆదివారం జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం చెప్పబడినా, ఇది రాజకీయ హంగామా, అవినీతి ఉదాహరణగా మిగిలిపోయిందని స్పష్టం చేశారు.
ఉత్తమ్ మాట్లాడుతూ.. రూ.87,449 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం, ఆరంభంలోనే సమస్యలతో కూలిపోయిందన్నారు. ప్రాజెక్టు గుండెకాయగా చెప్పబడిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే కుంగిపోయిందని చెప్పారు. రూ.21 వేల కోట్ల ఖర్చుతో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మించగా, ఈ మూడు బ్యారేజీలు గత 20 నెలలుగా పూర్తిగా నిరుపయోగంగా మారాయని మండిపడ్డారు.
ప్రాజెక్టు ప్రణాళికలో కూడా లోపాలున్నాయని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. 2014లోనే తాము ప్రాణహిత ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గుర్తుచేశారు. అలాగే ఇచ్చిన నివేదికకు ముందే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని ఆ సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ తగిన సాంకేతిక పరిశీలనలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ప్రతి ఏడాది 195 TMCల నీటిని ఎత్తిపోస్తామని గొప్పలు చెప్పుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. కానీ ఐదేళ్లు కలిపి కేవలం 125 TMC నీరు మాత్రమే ఎత్తిపోశారు. అందులో 35 TMC నీరు సముద్రంలో కలిసిపోయింది. లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో వాడుకున్న నీరు మొత్తం ఐదేళ్లలో 101 TMCలు మాత్రమే. ఇది ఏ రీతిగా సమర్థవంతమైన వినియోగమని చెప్పగలరు? అంటూ సభలో ప్రశ్నించారు.
Also Read: Free Toll Plaza: పేరుకే టోల్ ప్లాజా.. ఇక్కడ ఒక్క వాహనం ఆగదు.. అసలు కారణం ఇదే!
మేము కాళేశ్వరం ఉపయోగించుకోకపోయినా, అప్పటికీ పంట రికార్డు స్థాయిలో పడింది. ఇది రైతుల కష్టానికి నిదర్శనం. కానీ బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఈ ప్రాజెక్టు కూలిపోయింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అని చెప్పక తప్పదని తేల్చారు మంత్రి. NDSA నివేదికలో మేడిగడ్డ కూలడానికి అనేక కారణాలు ఉన్నట్లు తేలిందని, కానీ ఆ సమయానికి అధికారులు చేసిన హెచ్చరికలను అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఇలా ధ్వంసమైపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ నేతల వల్లే ఈ స్థితి వచ్చిందని ప్రజలు గుర్తించి నవ్వుకుంటున్నారని అన్నారు.
ప్రాజెక్టు ప్రారంభం నుంచి నిర్వహణ వరకు అనేక సాంకేతిక లోపాలు, పాలనలో నిర్లక్ష్యం, పారదర్శకత లేకపోవడం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఆసియా లోనే అతిపెద్ద ప్రాజెక్టు అని ఘనత చెప్పుకున్న ఈ నిర్మాణం ఇప్పుడు రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం గా మారిందని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై విస్తృతమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలు, నిధుల వినియోగం పై పూర్తి స్థాయిలో వివరాలు ప్రజలకు వెల్లడించాలని వారు కోరుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై తదుపరి చర్యలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రజల డబ్బు వృథా కాకుండా జాగ్రత్త పడతాం. కాళేశ్వరాన్ని తిరిగి నిలదొక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.