KGF Actor:సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు అప్పుడప్పుడు జబ్బుల బారిన పడుతూ అభిమానులను ఆందోళనకు గురి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ జబ్బుల కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు. మరికొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు.. నిన్న మొన్నటి వరకు చూసిన సెలబ్రిటీలను సడన్ గా గుర్తుపట్టలేని స్థితిలో చూసేసరికి అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ (KGF) సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న హరీష్ రాయ్ (Harish Rai) ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా కనిపించి, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. మరి అసలేం జరిగింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కేజిఎఫ్ నటుడు..
ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో కన్నడ హీరో యష్ (Yash) హీరోగా వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాలు కన్నడ సినీ పరిశ్రమను ఎల్లలు దాటించి, ఈ పరిశ్రమకు ఒక గుర్తింపును అందించాయి అనడంలో సందేహం లేదు. అంతలా కేజిఎఫ్ చిత్రాలు మంచి విజయం అందుకోవడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది. అలా కేజిఎఫ్ సినిమాలో చాచా పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్న కన్నడ నటుడు హరీష్ రాయ్. ఈయన ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డ హరీష్ రాయ్..
కారణం థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారట. ప్రస్తుతం చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలి అంటూ ఆయన కోరుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో హరీష్ రాయ్ చాలా బలహీనంగా సన్నగా మారిపోయారు. ఇన్ఫెక్షన్ సోకి పొట్టలో వాపు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.
ఆర్థిక సహాయం ప్రకటించిన ధ్రువ సర్జ..
ఈయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. హరీష్ రాయ్ చికిత్సకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తానని కన్నడ హీరో ధ్రువ సర్జ (Dhruva Sarja)హామీ ఇచ్చినట్లు ఇప్పుడు కన్నడ మీడియా కూడా స్పష్టం చేసింది. అంతేకాదు హరీష్ చికిత్సకు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఒక్కో ఇంజక్షన్ కి రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుందని సమాచారం. అందులో భాగంగానే ధృవసర్జా స్పందించి సుమారు రూ.11 లక్షల రూపాయల చెక్కును అందించారట.. ఈ విషయాన్ని ప్రముఖ నటి శశికళ స్పష్టం చేశారు.
రూ. 70 లక్షల వరకు ఖర్చు..
ప్రస్తుతం థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఈయన చికిత్సకు రూ.70 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్య బృందాలు తెలిపాయట. ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు రూ.3.5 లక్షలు కాగా.. వైద్యులు 63 రోజుల వ్యవధిలో ఒక సైకిల్ కి మూడు ఇంజక్షన్లు అంటే ఒక్కో సైకిల్ కి రూ.10.5 లక్షలు అవుతుందని సూచించారట. చాలా సందర్భాలలో రోగులకు 17 నుండి 20 ఇంజక్షన్లు అవసరమవుతాయని.. వాటి విలువ సుమారుగా రూ.70 లక్షలు అవుతుందని హరీష్ రాయ్ తెలిపారు. ఇక ఈయన పరిస్థితి చూసి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇక ఈయన చికిత్సకు పూర్తి డబ్బు అంది ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ALSO READ:Nivetha Pethuraj: లవ్ స్టోరీపై నోరు విప్పిన నివేదా. సినిమా తీసేయొచ్చు భయ్యా!