గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్వవహారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.ఎవరైతే పార్టీ ఫిరాయింపుల కింద మొన్నటివరకు విచారణను ఎదుర్కొన్న శాసన సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమర్పించిన అఫిడవిట్ మొత్తానికి రివీల్ అయ్యింది.దీంతో వారు చెప్పిన సమాధానాలు విని అంతా షాకవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది.తాము గులాబీ పార్టీలో ఉన్నామని, కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్ వద్ద ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ జాబితాలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. అందుకే వీరిపై ఫిరాయింపుల చట్టం కింద ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు సమాచారం.
2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ గుర్తు మీద గెలిచిన పది ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని.. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు తీర్మానం కాపీని అందజేశారు. స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవ్వడంతో హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు. అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవ్వడంపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన విచారణలో వేగంగా పెంచారు. ఈ క్రమంలోనే పైన పేర్కొన్న ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు.
ఇవాళ మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. వారిలో సంజయ్ కుమార్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. వీరికి సైతం క్లీన్ చిట్ ఇస్తారా? లేక అనర్హత వేటు వేస్తారా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే, బుధవారం సాయంత్రం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని అఫిడవిట్ సమర్పించారు. దీనిపై బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.కాంగ్రెస్‌లో చేరకపోతే ‘మీ బిడ్డకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎలా వచ్చిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎలా ప్రచారం చేశావని’ ప్రశ్నించారు.కడియం వేశాలన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ది చెబుతారని ఫైర్ అయ్యారు.
దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్‌లో చేరలేదని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తుమీద నిలబడ్డారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే స్పీకర్ అనర్హత వేటు వేసేకంటే ముందే ఆయన రాజీనామా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయని.. అప్పుడు అధికార పార్టీ తీరును ప్రజల్లో ఎండగట్టి ఎన్నికల్లో గెలవాలని భావించిన గులాబీ పార్టీకి నిరాశే ఎదురైంది. దానం మీద స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు ఉపఎన్నిక తప్పదు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కేటీఆర్ భావిస్తున్నారు. కాగా, తాము పార్టీ మారలేదని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ మీటింగులకు మాత్రం హాజరవ్వడం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు. తాము గులాబీ ఎమ్మెల్యేలమే అయినా ‘మా మద్దతు మీకివ్వం’ అంటూ దూరం దూరంగా ఉంటున్నారు. మరో వైపు నియోజకవర్గ అభివృద్ధి పేరిట అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.