
Bandi Sanjay Latest News(Political news in telangana): తెలంగాణ బీజేపీలో అధ్యక్ష మార్పు గురించి ముందుగానే లీకులొచ్చాయి. మీడియా మొత్తం ఊదరగొట్టింది. ప్రచారం జరిగినట్టుగానే.. బండి సంజయ్‌పై వేటు పడింది. అంతా అన్నట్టుగానే కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈటలకు మాత్రం ప్రచార కమిటీ అనుకుంటే.. ఎన్నికల కమిటీ బాధ్యతలు కట్టబెట్టారు. ఇదొక్కటే ఛేంజ్. దీంతో పాటు మరో న్యూస్ కూడా మిస్ అయింది. అదే, బండి సంజయ్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారనే వార్త. అధ్యక్ష కిరీటమైతే లాక్కున్నారు కానీ.. ఇంకా మంత్రి పదవిని మాత్రం ఇవ్వలేదు అధిష్టానం. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తేల్చేస్తారనుకుంటే.. ఆ దిశగా ఎలాంటి ఇండికేషన్లూ లేవు. గురువారం మోదీ, షా, నడ్డాలు.. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. ఏయే రాష్ట్రాల నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై మారథాన్ కసరత్తు చేశారు. మరి, అందులోనైనా బండి సంజయ్ గురించి చర్చ జరిగిందా?
ఎందుకు? బండి సంజయ్‌ను అంతలా ఎందుకు అవమానిస్తున్నట్టు? పార్టీ పదవి తీసేసిన వెంటనే.. కేంద్ర మంత్రి పదవి ఇచ్చుంటే హుందాగా ఉండేదిగా? బండికి మరింత గౌరవం దక్కుండేదిగా? ఇంత అవమానకరంగా అధిష్టానం ఎందుకు వ్యవహరిస్తోందనే చర్చ నడుస్తోంది. ముందుముందు ఇస్తారేమో అనే ప్రచారం కూడా జరగట్లేదు. అసలు, బండి సంజయ్ పదవి గురించి ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. అంటే, ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందనట్టేగా? ఇస్తారంటూ ముందస్తు ప్రచారం జరిగినా.. మంత్రి పదవి ఇవ్వలేదంటే.. ఏవో బలమైన శక్తులు అడ్డుకుంటున్నట్టేగా?
బండి సంజయ్‌ను జాతీయ పార్టీలోకి తీసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏ రఘునందన్‌రావులాంటి వారికో ఇవ్వాల్సిన పార్టీ పదవులను.. బండికి ఇస్తే అది ఆయన స్థాయిని తగ్గించినట్టే అవుతుందని అంటున్నారు. ఇస్తే గిస్తే.. కేంద్ర మంత్రి పదవి ఇస్తేనే.. బండి సంజయ్‌కు గుర్తింపు, గౌరవం. లేదంటే.. అవమానమే అని చర్చించుకుంటున్నారు.