KOMATIREDDY : నోటీసు ఎందుకు ఇచ్చారంటే?
ఏఐసీసీ తనకిచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నవంబర్ 1న సీల్డ్ కవర్‌లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం పంపానని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి ఓటు వేయాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి చెప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ అక్టోబర్ 22న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మునుగోడు ఉపఎన్నికకు ముందు ఆస్ట్రేలియాలో ఉన్న కోమటిరెడ్డి నవంబర్ 3న హైదరాబాద్ చేరుకున్నారు.
KOMATIREDDY : లేఖలో ఏముంది?
నవంబర్ 1న ఏఐసీసీకి సమధానం పంపానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేయాలంటూ తాను చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఫేక్ వీడియోగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. అది మార్ఫింగ్ వీడియో అన్నారు. కాంగ్రెస్ లో తాను చాలా సీనియర్ నేతనని ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం నుంచి పార్టీలో ఉన్నానని వివరించారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. తన సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
KOMATIREDDY : సందేహాలెన్నో..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నవంబర్ 1 తేదీనే సమాధానం పంపిస్తే..మరి రెండోసారి కాంగ్రెస్ పార్టీ ఎందుకు షోకాజ్ నోటీసు ఇచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. అంటే ఆయన పంపిన షీల్డ్ కవర్ లోని లెటర్ ఏఐసీసీకి చేరలేదా? అనే అనుమానం నెలకొంది. ఈ విషయంపై ఏఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.