కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటే నాడు నీటిపారుదల శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారులనూ వెంటాడుతోంది. రాష్ట్రంలో సర్కారు మారిన కొద్ది రోజులకే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల డ్యామేజీపై సర్కారు జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికిపైగా విచారణ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పూర్తి బాధ్యత మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని నివేదికలో పేర్కొంది. ఆయనతో పాటే నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి, పలువురు అధికారును బాధ్యులుగా పేర్కొన్నది. కాగా, ఈ నివేదికను బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, అనుకోకుండా వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తుది తీర్పు రావాల్సి ఉన్నది. అందరూ తీర్పు గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తీర్పును ఈ నెల 22వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను గతంలోనే కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ జోషి సవాల్ చేసిన విషయం తెలిసిందే.కొన్నినెలలుగా ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. మార్చి 12న దీనిపై వాదనలు పూర్తవ్వగా కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువడుతుందని భావించగా.. ఏప్రిల్ 22కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని, దానిలో ఉన్నదంతా అవాస్తవమని బీఆర్ఎస్ తరఫున పిటిషన్ దాఖలైంది. రాజకీయకక్షలో భాగంగానే ఈ కమిషన్‌ను వేశారని ఆరోపించారు.కాగా,ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను వేశామని ప్రభుత్వం తెలిపింది. వాదనలు జరిగే సమయంలో కేసీఆర్ తరపు అడ్వొకేట్.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు వివరించారు.8(B), 8(C) నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడా సాక్షితో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బంగారం పైపైకి.. సామాన్యుడు కిందికి.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న పసిడి, వెండి ధరలు!
పై అంశాలను పరిగణలోకి తీసుకుంటే కేసీఆర్ తరఫు వాదనలు విన్న కోర్టు.. ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పునిస్తుందా? లేక విచారణ సక్రమంగా జరగలేదని, మరోసారి మొదటి నుంచి విచారణ జరపాలని ఆదేశిస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నది. అయితే, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కాళేశ్వరం మీద కమిషన్ వేయడాన్ని రాజకీయ కక్షగా హైకోర్టు భావిస్తుందా? అనేది కూడా తెలియాల్సి ఉన్నది. ఒకవేళ కమిషన్ నివేదికను న్యాయస్థానం తోసిపుచ్చితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. సర్కారు వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తే కేసీఆర్, హరీశ్ రావు, మిగతా అధికారులు జైలుకు వెళ్లే అవకాశం లేకపోలేదని సమాచారం.