Big Stories

Delhi Liquor Scam : కవిత అరెస్ట్..!? ఈసారి పక్కాగా ..?

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. పెద్ద తలకాయలను ఒక్కొక్కరిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్టు చేస్తూ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి సీబీఐ దూకుడు మరింత పెంచింది. అటు ఈడీ అదే రూట్ లో దూసుకెళుతోంది. దీంతో ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల్లో మద్యం స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అరెస్టు చేసింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై ను అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. వారం రోజుల కస్టడీకి ఈడీ అధికారులు కోరగా .. కోర్టు అనుమతించింది.

- Advertisement -

అరుణ రామచంద్ర పిళ్లైను కోర్టులో హాజరపర్చిన సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్‌లో పిళ్లై భాగస్వామిగా ఉన్నారని చెప్పింది. లిక్కర్ పాలసీ కోసం జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారని… సమీర్ మహేంద్రుతో కలిసి కీలకంగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లై, బుచ్చి బాబుకి సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ అమౌంట్ పంపిణీలో పిళ్లై ప్రధాన పాత్ర పోషించారని కోర్టుకు వివరించింది. అరుణ్ పిళ్లైతో బుచ్చి బాబును కలిపి విచారించాలని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది.

- Advertisement -

ఇప్పటి వరకు మొత్తం 29 రోజులు పిళ్లైను విచారించారని ఆయన తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని తెలిపారు. విచారణను ఈడీ అధికారులు రికార్డ్ చేశారన్నారు. పిళ్లైను అరెస్ట్‌ చేసేందుకు ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందని ఈడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ సాక్ష్యం ఉన్న తర్వాత పదే పదే పిలిచి ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారని… నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా అని అడిగారు.

పిళ్లై రిమాండ్ రిపోర్ట్..
17 పేజీలతో అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ను ఈడీ రూపొందించింది. ఈ రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించింది. కవిత బినామీ అని అనేకసార్లు పిళ్లై స్టేట్ మెంట్స్ ఇచ్చారని పేర్కొంది. ఇండో స్పిరిట్ స్థాపనలో ఆయనే కీలకపాత్ర పోషించారని తెలిపింది. కాగితాలపై మూడున్నర కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చూపించారని పేర్కొంది. కవిత ఆదేశాలతో పిళ్లై పనిచేశారని వివరించింది. లిక్కర్ స్కామ్ లో హవాలా పై ఆయనను ప్రశ్నించాలని ఈడీ స్పష్టం చేసింది.

రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ గతంలో సోదాలు చేసింది. కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉన్నారు. ఈ వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేయడం.. తాను కవిత ప్రతినిధిని చెప్పారని ఈడీ పేర్కొడంతో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఆమె నివాసానికి వచ్చి సీబీఐ కవితను ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ కవిత సన్నిహితులను అరెస్ట్ చేసింది. మరి ఈడీ నెక్ట్స్ టార్గెట్ కవితేనా? అరెస్ట్ ఖాయమేనా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News