Phone Tapping: తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఓ కుదుపు కుదిపేస్తోందా? ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విపక్షాల మెడకు చుట్టుకుందా? ఈ వ్యవహారంలో వైస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయినట్టు వార్తల వెనుక ఏం జరుగుతోంది? ఏపీ, తెలంగాణలో దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారం లో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తొలి రోజు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పేర్లు వెలుగులోకి రాగా, ఇప్పుడు పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల పేర్లు సైతం బయటకు వచ్చాయి. ట్యాపింగ్ వ్యవహారంలో తీగలాడితే డొంక కదులుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నోరు విప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజమన్నారు. అప్పటి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనా? అనేది తనకు తెలీదన్నారు. ఒక్కమాట అయితే ఆమె స్పష్టంగా చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది మీద జరిగిందో తనకు తెలీదుగాని.., తనది, భర్త, బంధువుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు స్పష్టంగా తెలిసిందన్నారు. మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్న విషయాన్ని నిర్ధారించింది వైవీ సుబ్బారెడ్డి అని తేల్చేశారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ఓ రోజు హైదరాబాద్‌లోని మాఇంటికి వచ్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ALSO READ: గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి.. ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన సీఎం రేవంత్
ఆడియో క్లిప్పింగ్‌ను తనకు వినిపించారని వివరించారు షర్మిల. ఈ విషయం వైవీ సుబ్బారెడ్డి అంగీకరిస్తారా? లేదా అనేది తనకు తెలీదని, అనుమానమేనని తెలిపారు. ఎందుకంటే జగన్.. తన మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను ఎలా ఒత్తిడి చేశారో? మీడియా ముందు ఎలా అబద్దాలు చెప్పించారో సాయిరెడ్డి స్వయంగా వెల్లడించారని తెలిపారు.
మరోవైపు ఇదే వ్యవహారంపై సిట్ ముందు బాధితులు వస్తున్నారు. వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన దర్యాప్తు అధికారుల దృష్టికి తెచ్చారు.
కేవలం కాంగ్రెస్ నేతలకు చెందినవే కాకుండా బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయాన్ని మీడియా ముందు చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా వ్యాపారవేత్తలు, ఉద్యోగుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వారిని సైతం విచారించేందుకు సిద్ధమయ్యింది సిట్.
దీంతో బీఆర్ఎస్, వైసీపీ కీలక నేతలకు వణుకు మొదలైంది. అసలే అధికారం పోయి ఇబ్బందిపడుతున్న నేతలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పుండు మీద కారం మాదిరిగా మారింది. దీని గురించి కొత్త కొత్త విషయాలు రావడం వారికి మింగుడు పడడం లేదు. రేపటి రోజున ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పేర్లు, బాధితులు సిట్ ముందుకు వస్తారో చూడాలి.
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
ఫోన్ ట్యాపింగ్ అప్పటి తెలంగాణ, ఏపీ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్
కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి మా ఫోన్లు ట్యాప్ చేశారు
మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి మరీ చెప్పారు
ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరగాలి… pic.twitter.com/K1NgTAHZ4a
— BIG TV Breaking News (@bigtvtelugu) June 18, 2025