కారణాలనేకం చూపుతున్నా.. అంతిమంగా చమురు ధరలు పెంచే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు ఇదే ప్రతిపాదనను కేంద్రం ముందుంచనుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో జనాల్లో విపరీతమైన ఆందోళన నెలకొన్నది. దీంతో భయంతో ట్యాంకు ఫుల్ చేయించుకోవడం, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. మూడు ఆయిల్ కంపెనీలు చమురు కొరతకు చెబుతున్న కారణాల్లో వార్ ఎఫెక్ట్ కొంతైతే.. వేసవి కాలం, ప్రయాణాలు పెరగడం, వ్యవసాయ పనులకు డీజీల్ వినియోగం తదితర కారణాలను చెబుతున్నది.
ఈ సంకేతాలందుకున్న పెట్రోల్,డీజీల్ బంకుల డీలర్లు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. భయంతో ఉన్నపళంగా వినియోగం పెరిగిపోవడంతో కూడా బంకులు చేతులెత్తేశాయి. ఈనెల 29న పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలున్నాయి. ఇవి ముగియగానే మూడు ఆయిల్ కంపెనీలు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు కేంద్రం ముందు ఈ చమురు ధరల పెంపునకు ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిసింది. ఇరాన్ యుద్ద ప్రభావంతో వారి చెబుతున్న కారణాల్లో వేసవికాలం, ప్రయాణాల భారంతో, డీజీల్ విపరీత వినియోగంతో పాటు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం .. ఇవన్నీ పరిగణలోకి తీసుకోనుంది. ఇవే ప్రతిపాదనలు కేంద్రం ముందుంచితే.. దాదాపు లీటర్‌కు రూ. 10 నుంచి రూ. 15 వరకు పెంచే అవకాశాలు లేకపోలేదని డీలర్లు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 99 గా ఉండగా, డీజీల్ లీటర్‌కు రూ. 110గా ఉంది. వీటికి సమాంతరంగా రూ. 10 నుంచి రూ. 15 వరకు పెంచే యోచనలో మూడు ఆయిల్ కంపెనీలున్నట్టు తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఈనెల 29న రెండో విడత ఎన్నికలు ముగియగానే.. కేంద్రం ఈ చమురు పెంపుపై ఆమోద ముద్ర వేయనున్నట్టు స్పష్టమైన సంకేతాలందుతున్నాయని డీలర్ల సంఘాలు చెబుతున్నాయి. ఇప్పట్లో మళ్లీ ఎన్నికలు లేకపోవడం కూడా కేంద్రానికి కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నారు. అందుకే చమురు ధరల పెంపుకే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత వచ్చే ఏడాది అక్టోబర్ వరకు గానీ యూపీ ఎన్నికలు లేవు. మళ్లీ అప్పుడు ఈ పెట్రో, డీజీల్ ధరలు తగ్గించి ఎన్నికలకు పోవాలనే రాజకీయ వ్యూహాన్ని కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
అయితే ప్రతీ బంకులు బఫర్ స్టాక్ కింద 2500 లీటర్ల పెట్రోల్, డీజీల్ నిల్వలు ఉంచుతారు. వీటిని ఏఐ ద్వారా ఆయిల్ కంపెనీలు లాక్ చేసి ఉంచారు. వీటి లాక్‌ను ఎత్తేస్తే ఈ నిల్వలను వాడుకోవడం ద్వారా ఇప్పుడు సృష్టించిన కృత్రిమ కొరత బాధ నుంచి జనాలను తప్పించవచ్చు. కానీ ఆ కంపెనీలు అలా చేయడం లేదు. దీంతో ఈ మూడు రోజులు పాటు పెట్రో, డీజీలు నిల్వల కొరతను చూపుతారు. నో స్టాక్ బోర్డులు ఎక్కువ దర్శనమివ్వడంతో జనం మరింత బెంబేలెత్తే పరిస్థితులు తలెత్తుతున్నాయి. రేటు పెంచుకునే లోపు.. డెడ్ స్టాక్‌లో ఉంచిన చమురును రిలీజ్ చేయాలని డీలర్లు భావిస్తున్నారు. పెంచుకున్న తరువాత మారిన రేటుతో వచ్చిన స్టాకుతో అమ్ముకోవచ్చు కదా.. ఇప్పట్నుంచే ఇవన్నీ ఇబ్బందులెందుకు పెడుతున్నారనే కామెంట్ల వస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు, కేంద్రం కావాలనే ఇవన్నీ చేస్తున్నాయని, కచ్చితంగా ఈనెల 30 న రేటు పెంచే ఆలోచన చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పదివేల వరకు బంకులున్నాయి.
షార్టేజ్ లేదు.. అది కృత్రిమ కొరతే!
నల్లా దినేశ్‌రెడ్డి, తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు
అనవసరంగా భయంతో జనం ఎగబడి మరీ కొనడంతో కొరత ఏర్పడింది. చాలా వరకు మూడు ఆయిల్ కంపెనీల నిర్వాకం వల్లే కృత్రిమ కొరత సృష్టించబడ్డది. రేటు పెంచుకుంటే.. అప్పటి వరకు డెడ్ స్టోరేజీలో లాక్ చేసిన చమురు నిల్వలను విడుదల చేయొచ్చు. కానీ వారు చేయరు. ఇక్కడ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారణాలు ఏవేవో చెబుతున్నా.. లాభాలు వచ్చినప్పుడు అవి చెప్పారా? ఇప్పుడు రేటు పెంచుకొని, కేంద్రానికి లాభాలు ఆర్జించి పెట్టే ఆలోచనే తప్ప.. పేదవాడి బాగోగులు, కష్టనష్టాలు వారికి పట్టవు.