South Korea : మన దేశంలో రైలు ప్రయాణ సమయానికి మనం వెళ్తే రైలు ఆలస్యంగా వస్తుంటుంది. ఎలాగూ రైలు ఆలస్యంగా అవుతుందిలే అని మనం కాస్త ఆలస్యం చేసామా… మనకంటే ముందే రైలు వెళ్లిపోతుంటుంది. ఇలా మనలో చాలా మందికే జరిగి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర రైళ్లు… చాలా వరకు ముందుగా చెప్పిన సమయానికి నడవవు కాబట్టి. కానీ.. దక్షిణ కొరియాలో అలా కాదు. క్షణాలు తేడా రాకుండా సరిగ్గా నిర్దేశించిన టైంలోనే అక్కడ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత క్రమశిక్షణ, సమయపాలన పాటించే రైల్వే వ్యవస్థగా అంతర్జాతీయ గుర్తింపు ఉంది.. ఇక్కడి రైల్వే వ్యవస్థకి. అలాంటి చోట.. ఇటీవల ఒకేరోజు ఏకంగా 125 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఎందుకని చూస్తే.. కాస్త నవ్వుకునే, మరికాస్త ఆశ్చర్యపడే విషయం తెలిసింది. అదేంటంటే..?
దక్షిణ కొరియాలో రైలు సమయానికి పట్టాలపైకి రావాల్సిందే. లేదని 1, 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందో.. అక్కడి ప్రయాణికులకు దక్షిణ కొరియా రైల్వే క్షమాపణలు చెబుతుంది. ఆలస్యానికి కారణాల్ని చెప్పి.. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి సంజాయిషి ఇస్తుంటుంది. అలాంటి చోట రైలు రాక మరింత ఆలస్యమైతే.. ప్రయాణికుల డబ్బులు వాపస్ ఇచ్చేసి.. వారిని గమ్యస్థానాలకు ఉచితంగానే చేరవేరుస్తుంటాయి. అంత నిక్కచ్చిగా దక్షిణ కొరియా రైల్వే వ్యవస్థ పనిచేస్తుంటుంది. అలాంటి చోట.. ఈ మధ్య ఓ రైళ్లు కండక్టర్ నాలుగు నిమిషాల పాటు టాయిలెట్ కి వెళ్లి వచ్చాడు. అవును.. కేవలం 4 నిముషాలే.. దానికి ఏమవుతుంది అంటారా? ఆ కాస్త ఆలస్యం చాలా.. మొత్తం రైల్వే వ్యవస్థ స్తంభించేందుకు అంటున్నారు అక్కడి అధికారులు.
ఈ వారం ప్రారంభంలో దక్షిణ కొరియా రాజధాని నగరం సీయోల్ లో.. ఉదయం 8 గంటల సమయంలో ట్రైన్ ఆపరేటర్ కాస్త విరామం తీసుకున్నాడు. స్టాప్ లో రైలు ఆపేసి అర్జెంటుగా టాయిలెట్ కి పరిగెత్తాడు. దగ్గర్లో టాయిలెట్ లేకపోవడంతో. పై అంతస్తులో ఉన్న టాయిలెట్ కి పరుగుపరుగున వెళ్లేసి వచ్చాడు. ఇలా వెళ్లి రావడానికి మొత్తం 4.16 నిముషాయలు పట్టిందంట. ఇంతలోనే జరగాల్సిన పొరపాటు అంతా జరిగిపోయింది. మినిట్ టూ మినిట్ పరిగణలోకి తీసుకొని రూపొందించిన రైళ్ల షెడ్యూల్ మొత్తం తారుమారైపోయింది.
ఒక్క ఆపరేటర్ చేసిన పనికి.. ఆ ట్రైన్ వెనక రావాల్సిన దాదాపు 125 పైగా ట్రైన్లు ఆలస్యంగా నడిచాయి. ఒకదాని తర్వాత ఒకటి గమ్యస్థానాలకు చేరుకునేందుకు లైన్లు క్లియర్ చూస్తూ… ట్రైన్ల రద్దీని తగ్గించేందుకు చాలా సమయమే పట్టిందంట. ఎంత శ్రమించినా.. ఒక్కో ట్రైన్ దాాదాపు 20 నిమిషాల ఆలస్యం గమ్యస్థానాలకు చేరుకున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి.
ఒక్కసారిగా ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావడానికి కారణం ఎవరా అని ఆరా తీస్తే.. ఇంకేముంది.. టాయిలెట్ కి వెళ్లిన ట్రైన్ కండక్టర్ విషయం బయటకు వచ్చింది. దీంతో.. అనుమతి లేని స్టేషన్ లో ట్రైన్ ని నిలపడం, షెడ్యూల్ ప్రకారం ట్రైన్ ను నడిపించడంలో విఫలం కావడం సహా.. పెద్ద సంఖ్యలో టైన్ల రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు విచారణ చేపట్టారు.
వాస్తవానికి సియోల్ రాజధాని నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగస్తుల పరుగులతో హడావిడిగా ఉంటుంది. అందుకే ఈ సమయాల్లో ట్రైన్ సర్వీస్ లు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అక్కడ రైల్వే, మెట్రో సహా ఇతర ప్రజా రవాణా వ్యవస్థలన్నీ ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా పకడ్బందీగా నడుస్తూ ఉంటాయి. అలాంటి చోట్ల ఓ డ్రైవర్ చేసిన అత్యవసర పని మొత్తం రాజధాని నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపించింది.
Also Read : అలలపై అద్భుతం.. దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి
ఈ రూట్లో రద్దీ కారణంగా అక్కడి ట్రైన్ కమాండర్ లకు 2, 3 గంటల పాటు విరామం లేకుండా పనిచేయటం అలవాటుగా ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థలో క్లిష్ట సమయాల్లో పనిచేసే ఉద్యోగస్తుల కోసం అక్కడ ఎప్పుడూ పోర్టబుల్ ట్యాయిలెట్లు అందుబాటులో ఉంటుంటాయి. అయితే ఆరోజు స్టేషన్లో ఉన్న టాయిలెట్ ను వాడుకోవాలని ట్రైన్ కండక్టర్ భావించడంతోనే అసలు సమస్య అంతా వచ్చిపడింది. మొత్తంగా ఈ విషయం తెలుసుకున్న నేటిజన్లు… బాసు కాస్త ఆపుకోవాల్సింది అంటూ సరదాగా కామెంట్లు చేసేస్తున్నారు