Indian Railways Waste Disposal Upgrade: ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. ప్రయాణం ఎక్కువ సేపు కొనసాగున్నప్పుడు కోచ్ ల లోని చెత్తబుట్టలు త్వరగా నిండిపోవడం, కోచ్ లన్నీ అపరిశుభ్రంగా కనిపించడం చికాకు కలిగిస్తాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భారతీయ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఝాన్సీలోని వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ఈ కొత్త చెత్త తొలగింపు వ్యవస్థకు సంబంధించిన మోడల్ ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ పరిశీలనకు పంపించారు.
కొత్త విధానంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. చెత్త వేసేందుకు డ్రాప్ బాక్స్, వ్యర్థాలను కిందకు పంపించే కనెక్టర్, అలాగే కోచ్ కింద అమర్చే అండర్ గేర్ గార్బేజ్ కలెక్టర్ ఉంటాయి. ప్రయాణికులు కోచ్‌లోనే సాధారణంగా చెత్తబుట్టలో చెత్త వేయవచ్చు. అయితే ఆ చెత్త అక్కడే ఎక్కువసేపు పేరుకుపోదు. కనెక్టర్ ద్వారా అది క్రమంగా కోచ్ కింద ఉండే పెద్ద కలెక్టర్‌లోకి చేరుతుంది. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా ఎలాంటి మాన్యువల్ ఆపరేషన్ అవసరం ఉండదు. గురుత్వాకర్షణ ఆధారంగా చెత్త కిందకు చేరుతుంది. కలెక్టర్‌ను ఖాళీ చేసే వరకు వ్యర్థాలు అందులోనే నిల్వ ఉంటాయి.
ప్రస్తుతం LHB కోచ్‌లలో సాధారణంగా రెండు చెత్తబుట్టలు ఉంటాయి. ఒక్కో బిన్ సామర్థ్యం సుమారు 15 నుంచి 20 లీటర్ల వరకు ఉంటుంది. దీంతో సుదూర ప్రయాణాల్లో అవి త్వరగా నిండిపోయే అవకాశం ఉంటుంది. కొత్త వ్యవస్థలో మాత్రం మొత్తం 376.4 లీటర్ల వరకు వ్యర్థాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందని CPRO NCR శివమ్ శర్మ తెలిపారు. దీంతో తరచూ చెత్తబుట్టలను ఖాళీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
కొత్త కలెక్టర్ తయారీలో స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించనున్నారు. ఇది బలంగా ఉండటంతో పాటు తుప్పును తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందువల్ల ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. కలెక్టర్‌ను సులభంగా ఖాళీ చేసేందుకు ప్రత్యేకమైన 3:10 టేపర్ డిజైన్ కూడా ఇచ్చారు. డ్రాప్ బాక్స్, కలెక్టర్‌లను రెండు వైపుల నుంచి విడిగా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పరిశుభ్రతను కాపాడటంతో పాటు దుర్వాసన సమస్యను కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు.
కొత్త గార్బేజ్ కలెక్టర్‌ను కోచ్ కింద అందుబాటులో ఉన్న స్థలాన్ని ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేశారు. దీంతో ఇప్పటికే ఉన్న అండర్ గేర్ పరికరాలు, ఇతర నిర్మాణ భాగాలకు పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవస్థ ప్రయోగాత్మక దశలో ఉంది. ఇప్పటికే దీనిని RDSO పరిశీలన, ఆమోదం కోసం సమర్పించారు. పరిశీలనలో ఏవైనా మార్పులు అవసరమని RDSO సూచిస్తే వాటిని చేసి, ఆ తర్వాతే తదుపరి అమలుపై నిర్ణయం తీసుకుంటారు. ప్రతి డిస్పోజల్ బిన్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.12,000 ఖర్చవుతుందని అంచనా. ఆమోదం లభిస్తే ఒక్కో కోచ్‌లో రెండు బిన్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని రెండు ఎగ్జిట్ డోర్ల సమీపంలో ఉంచేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే సుదూర రైలు ప్రయాణాల్లో చెత్త మెయింటెనెన్స్ మరింత సులభం కావడంతో పాటు కోచ్‌లలో పరిశుభ్రతను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!