Best Rainy Season Road Trips: దేశంలో వర్షాకాలం ప్రారంభమైతే ప్రకృతి పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఎండిపోయిన కొండలు పచ్చగా మారిపోతాయి. జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. రోడ్లపై పొగమంచు కమ్ముకుంటుంది. ఈ టైమ్ లో రోడ్ ట్రిప్ కు వెళ్తే మర్చిపోలేని అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. వర్షాల్లో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సీజన్ లో దేశంలో తప్పక వెళ్లాల్సిన 6 అందమైన రోడ్ ట్రిప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షకాలంలో ముంబై నుంచి గోవా వరకు చేసే ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంకణ్ తీరప్రాంత రహదారులు పచ్చని కొండలు, చిన్న చిన్న జలపాతాలు, పొగమంచుతో కూడిని గ్రామాలతో అందంగా ఆకట్టుకుంటాయి. మార్గమధ్యంలో కనిపించే చిన్న టీ స్టాళ్లలో వేడి చాయ్, పకోడీలు తింటూ ప్రయాణం చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
బెంగళూరు నుంచి కూర్గ్ వెళ్లే రోడ్ ట్రిప్ కూడా వర్షాకాలంలో చాలా ఆకట్టుకుంటుంది. కాఫీ తోటలు, చల్లని గాలి, మబ్బులతో కప్పబడిన కొండలు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. వర్షం తర్వాత వచ్చే మట్టి వాసన, చుట్టూ కనిపించే పచ్చదనం ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తాయి.
ఢిల్లీ నుంచి మసూరీ ప్రయాణం కూడా మాన్సూన్ లో అద్భుతంగా ఉంటుంది. కొండల మధ్య వంకర తిరిగే రోడ్లు, దట్టమైన అడవులు, చల్లని వాతావరణం ఈ ట్రిప్ ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. మార్గమధ్యంలో ఉన్న జలపాతాలు, చిన్న కేఫ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి చిరాపుంజి వరకు చేసే ప్రయాణం వర్షాల సమయంలో నిజంగా మ్యాజిక్ చేస్తాయి. ఎక్కడ చూసినా జలపాతాలు, మేఘాలతో నిండిన లోయలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఇదీ ఒకటి కావడంతో, ఈ మార్గం మరింత అందంగా మారుతుంది.
Read Also: శ్రీలంక బంపర్ ఆఫర్.. ఇండియన్ టూరిస్టులకు ఫ్రీ వీసా!
పూణే నుంచి లోనావాలా వరకు చేసే రోడ్ ట్రిప్ పశ్చిమ భారతంలో మోస్ట్ పాపులర్. పచ్చని లోయలు, కొండలపై నుంచి జారిపడే జలపాతాలు, పొగమంచుతో నిండిన వ్యూ ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. కుటుంబంతో, స్నేహితులతో వీకెండ్ ట్రిప్ కు ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
గౌహతి నుంచి తవాంగ్ వరకు చేసే ప్రయాణం అడ్వెంచర్ ను ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. పొడవైన మౌంటెయిన్ హైవేలు, మబ్బులతో కప్పబడిన కొండలు, ప్రశాంతమైన బౌద్ధ మఠాలు ఈ ప్రయాణంలో ఆకట్టుకుంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది.
Read Also: రాత్రి కూడా పగలే.. ప్రపంచంలో సూర్యుడు అస్తమించని 8 ప్రాంతాలు ఇవే!