Amaravati to Hyderabad train: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకు ఇండియన్ రైల్వే ఓ గుడ్ న్యూస్ తెచ్చింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ కలిసి రైల్వే అభివృద్ధి పరంగా కీలక అడుగు వేశాయి. అమరావతిని హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీతో నేరుగా కలిపే హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. అంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ముందుకు వెళ్లే దశలోకి చేరిందని చెప్పవచ్చు.
ఈ రైలు ఒక సాధారణ రైలు కాదు. గంటల కొద్ది చేసే ప్రయాణాన్ని అరగంటల వ్యవధిలో ముగించేదిగా ఉండబోతోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రైలు ప్రయాణానికి 5-6 గంటలు పడుతోంది. కాని ఈ హై-స్పీడ్ రైలు ద్వారా ప్రయాణ సమయం సగానికి కంటే తక్కువగా మారుతుంది. అంటే దాదాపు 2.5 గంటల్లో చేరగలుగుతాం. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో దీనిని ఓ గ్లోబల్ టెక్, ఇండస్ట్రియల్ హబ్‌గా రూపుదిద్దుతోంది. భారీ స్థాయిలో డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు మొదలైనవి ఇక్కడ స్థాపించనున్నారు. లక్షల ఉద్యోగాల అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా తెరుచుకోనున్నాయి. ఇక అమరావతిని కూడా ఏపీ ప్రభుత్వం డల్లాస్ మోడల్ ఆధారంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు భవిష్యత్ కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా అవసరం ఏర్పడింది. అదే ఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ప్రాధాన్యత.
రైలు మార్గం కేవలం ప్రయాణాన్ని మాత్రమే వేగవంతం చేయదని, ఆ మార్గాన్ని అనుసరించి కొత్త పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్ధులు, పరిశ్రమలు, ఉద్యోగుల మధ్య ప్రయాణం మరింత వేగంగా, జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమరావతిని టచ్ చేసేలా హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు అదే దారిలో రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో హై స్పీడ్ లైన్ వేయబోతున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ సంస్థ ఒకటి ఇప్పటికే రూట్ మ్యాప్, స్టేషన్‌లు, భూసేకరణ అంశాలపై ఫీజిబిలిటీ స్టడీ చేపట్టింది. దీన్ని ఆధారంగా తీసుకుని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారుచేసి కేంద్రానికి సమర్పించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భూసేకరణ, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP మోడల్) వంటి అంశాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ప్రభుత్వం ఈ అంశాలను ముందుగానే పరిగణలోకి తీసుకుని ప్రణాళికను రూపొందిస్తే, ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యే అవకాశాలు మరింత మెరుగవుతాయి.
ఇక కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ పై మరింత దృష్టి పడింది. కేంద్రం మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న ఈ సమయంలో, దక్షిణ భారత అభివృద్ధికి ఇది కీలక దశగా నిలవనుంది. ఫండింగ్, బడ్జెట్, నిర్మాణ దశల గురించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది కేవలం ఓ రైలు ప్రాజెక్ట్ కాదు.. ఇది రెండు రాష్ట్రాల భవిష్యత్తును, ఆకాంక్షలను కలిపే హై టెక్ స్పీడ్ దారి. ఇది రీజినల్ డెవలప్‌మెంట్‌కు ఓ టర్నింగ్ పాయింట్. వేగవంతమైన రవాణా, ఉద్యోగావకాశాలు, పెట్టుబడుల వృద్ధి.. అన్నింటికీ ఇది బీజం వేసే ప్రాజెక్ట్ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.