Bengaluru-Madgaon Vande Bharat: గోవాకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వేగుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు నుంచి తీరప్రాంత కర్ణాటక మీదుగా గోవాలోని మడ్గావ్ వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మంగళూరు సెంట్రల్ నుంచి మడ్గావ్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను బెంగళూరు వరకు పొడిగిస్తున్నారు. ఈ విస్తరించిన సర్వీసును నవంబర్ మూడో వారంలో ప్రారంభించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బెంగళూరు, మంగళూరు, ఉడుపి, కార్వార్ ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది.
బెంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఉడుపి-చిక్కమగళూరు ఎంపీ కోట శ్రీనివాస్ పూజారికి ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్ మూడో వారంలోపు పొడిగించిన రైలును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైలును ప్రారంభించేందుకు మంగళూరును సందర్శిస్తానని కూడా మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసిన సమయంలో ఎంపీకి ఈ హామీ ఇచ్చారు. గతంలో సెప్టెంబర్ 29న మంగళూరు-మడ్గావ్ వందే భారత్ రైలును బెంగళూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు.
ప్రస్తుతం మంగళూరు సెంట్రల్-మడ్గావ్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు సర్వీసును యశ్వంత్ పూర్ వరకు పొడిగించనున్నారు. ఈ మార్పుతో రైలు కొత్త నంబర్లతో నడవనుంది. పాత రైలు నంబర్లు 20646 / 20645 కాగా, కొత్త రైలు నంబర్లు 26655 / 26656. కొత్త సర్వీసు పేరు యశ్వంత్‌పూర్-మడ్గావ్-యశ్వంత్ పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా నిర్ణయించారు. ఈ రైలు మంగళూరు మీదుగా ప్రయాణించనుంది. పొడిగింపుతో పాటు రైలు సమయాల్లో కూడా మార్పులు చేయనున్నారు.
ఈ వందే భారత్ రైలు పొడిగింపుతో కర్ణాటక రాజధాని బెంగళూరుకు తీరప్రాంత ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాల ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులు వేగవంతమైన రైలు ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంది. గోవాలోని మడ్గావ్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ సర్వీసు ఉపయోగపడనుంది.
ఈ సమావేశంలో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)ను భారతీయ రైల్వేలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా ఎంపీ ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంకణ్ రైల్వే పరిధిలో రైల్వే లైన్ల రెట్టింపు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆయన వివరించారు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రైల్వే మంత్రులు హామీ ఇచ్చారు.
Read Also: ఢిల్లీకి మరో కొత్త వందే భారత్ రైలు.. రూట్, స్టాప్స్, టైమింగ్స్ ఇవే!