Attack on Passengers: వీధుల్లో ఆటలు కాదు, రైళ్ల మీద స్టంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నాలు ఇప్పుడు మరీ హద్దులు దాటి పోతున్నాయి. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఏ హద్దులైన దాటగలరు అనే విషయంలో ఇద్దరు యువకులు బీహార్‌లో ఓ దారుణమైన ఉదాహరణగా చూపించారు. తాజాగా ఒక రైలు దాటుతున్న సమయంలో ప్రయాణికులపై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై RPF ఎలా స్పందించింది? ఈ ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
బీహార్‌లోని నాగరీ హాల్ట్ వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇద్దరు యువకులు రైలు పట్టాల పక్కన నిలబడి ప్రయాణికులపై కర్రలతో దాడి చేసిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో రైల్వే రక్షణ దళం (RPF) స్పందించి వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేసింది. కేసు నమోదు చేసి, మిగిలిన వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇది సరదాగా చేసిన పని కాదు, ఇది చాలాపెద్ద నేరం అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఈ వీడియోపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది తమ గత అనుభవాలను షేర్ చేస్తూ, రైల్లో ప్రయాణించేటప్పుడు ఎదురైన ప్రమాదకరమైన ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి తన కుటుంబంతో రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, కొన్ని రాళ్లు రైలు మీదకు విసిరిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. దీంతో రైలు డోర్ వద్ద నిలబడిన తన సోదరుడికి గాయమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరొకరు ముంబైలో మన్కర్డ్ టన్నెల్ దగ్గర చోటుచేసుకున్న దాడిని గుర్తు చేశారు. దొంగలు గేట్ల దగ్గర నిలబడిన ప్రయాణికులపై కర్రలతో దాడి చేసి, వారి ఫోన్లు లాక్కొని పారిపోయారట. ఇలాంటి ఆలోచన ఎలా వస్తుంది? అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన ప్రజల్లో భయం కలిగించడం కంటే, సమాజంలో తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు పొందాలనే తాపత్రయం ఏ స్థాయికి చేరిందో ఇలాంటి ఘటనలే ఉదాహరణ. ఇప్పుడు చిన్న వయసులో ఉండే యువత సోషల్ మీడియాలో లైక్స్, షేర్ల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ ఈ పని వారి జీవితాన్ని కూడా క్షణాల్లో మార్చేస్తుంది. ఇలాంటి చర్యలతో నేర పరమైన కేసులు నమోదు అవుతాయి, జీవితాంతం దాని భారం మోయాల్సి వస్తుంది.
RPF ఈ సందర్భంగా ప్రజలకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఇలా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఎందుకంటే మన భద్రత, మన చేతుల్లోనే ఉంటుంది. ఒకరిని వైరల్ చేసే వీడియోలు, మరొకరిని నష్టం కలిగిస్తాయి. అలాంటి వీడియోలు తీయడమే కాదు, చూసి ఆనందం పొందడమూ తప్పే.
నేటి సమాజానికి ఇది ఒక బుద్ధికలిగించే ఘటన. సోషల్ మీడియా వినియోగం సరైనదే కానీ, అది మన వ్యక్తిత్వాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్తే ఆ ప్రమాదాన్ని ఊహించలేం. ఈ ఇద్దరు యువకులు కొన్ని సెకన్ల వీడియో కోసం, వారి జీవితంలో నిందితులుగా మిగిలిపోయారు. ఇకపై అలాంటి ఘటనా మళ్లీ జరగకూడదంటే, మనందరం కలసి స్పందించాలి. ఇలాంటి వీడియోలను షేర్ చేయకుండా, సంబంధిత అధికారులకు తెలియజేయడం మన బాధ్యత.
రైలు ప్రయాణం అనేది సురక్షితంగా ఉండాలంటే, ప్రతి ప్రయాణికుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కోసం ముప్పు తలపెట్టే ప్రయత్నం కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. వాస్తవంగా చూడాలి – ఇవి వినోదం కాదు, నేరం. ఫేమ్ కోసం చేసే పని కాదు, శిక్ష పాలయ్యే పని.