పాకిస్థాన్(Pakistan)పై మన పొరుగు దేశం చైనా(China)కు ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడల్లా డబ్బు సాయం చేస్తుంటుంది. తాజాగా ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో కూడా పాక్‌పై తమకు ఉన్న మమకారాన్ని చూపించింది. దొంగ దారిలో ఆయుధాలు అందించి సహకరించింది. చైనా.. ఆర్థికంగానే కాకుండా.. అప్పుడప్పుడు కొన్ని గిఫ్టులు కూడా ఇస్తుంటుంది. తాజాగా ఆ దేశానికి రోడ్డు మీద నడిచే రైలును బహుమతిగా ఇచ్చింది. అదేంటీ.. రోడ్డు మీద నడిచే రైలా? భలే వింతగా ఉందే అనుకుంటున్నారా? అయితే, దాని ప్రత్యేకత గురించి తెలుసుకోవల్సిందే.
సబ్ వే ఆన్ వీల్స్..
ఇటీవల పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో సరికొత్త మెట్రో రైలు ప్రత్యక్షమైంది. దీన్ని ‘సబ్‌వే ఆన్ వీల్స్’ (Subway On Wheels) లేదా ‘మెట్రో ఆన్ వీల్స్’ (Metro On Wheels) అని పిలుస్తున్నారు. పాకిస్థాన్‌లో ట్రాక్ అవసరం లేకుండే నడిచే మొట్టమొదటి రైలు ఇదే. దీంతో అక్కడి ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్థిక స్తోమతలేని పాకిస్థాన్‌కు ఇంతమంచి రవాణా సదుపాయం ఎలా దొరికిందబ్బా.. అని ఆరా తీస్తే.. దాన్ని చైనా గిఫ్టుగా ఇచ్చిందని తెలిసింది. ఈ మోడ్రన్ మెట్రో పూర్తిగా ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ అని, పూర్తిగా సోలర్ వ్యవస్థతో పనిచేస్తుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల దీన్ని అక్కడి పంజాబ్ ముఖ్యమంత్రి మర్యాం నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఈ ‘మెట్రో ఆన్ వీల్స్’ సేవలను మరో 30 నగరాలకు విస్తరిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
రోడ్డుపై నడిచే ఈ రైలు ప్రత్యేకతలు ఇవే
ఈ మెట్రో ఆన్ వీల్స్‌కు రైళ్ల తరహాలోనే మూడు నుంచి నాలుగు కోచ్‌లు ఉండాయి. వాటిలో సుమారు 250 నుంచి 300 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవ్చు. వీటికి ఎలాంటి రైల్వే ట్రాక్స్, ఎలివేటెడ్ కారిడార్లు (మెట్రోల కోసం నిర్మించే వంతెనలు) అవసరం లేదు. సోలార్, ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. కాబట్టి.. కాలుష్య సమస్యలు ఉండవు. వీటి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఫ్రీ వైఫై సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. సీసీటీవీల నిఘా ఉంటుంది.
Also Read: ఎయిరో ట్రైన్.. ఈ రైలు ఎక్కితే గాల్లో తేలినట్లు ఉంటుంది.. కెఫే, బార్ కూడా ఉన్నాయ్!
సమస్యలూ ఉన్నాయ్..
అయితే ఇలాంటి రైళ్లను రోడ్డు మీద నడపడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ రైళ్లలో ప్రయాణించినా.. బస్సులో వెళ్లినా ఒక్కటే. పైగా ఈ రైలు బస్సు వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో మాత్రమే వీటిని నడపాలి. అయితే, ఇరుకు మార్గాల్లో వీటిని నడపడం కష్టమే. ఇందుకు వెడల్పాంటి రోడ్లు అవసరం. అయితే ఇది సోలార్, ఎలక్ట్రిక్ పవర్ మీద నడుస్తుంది కాబట్టి.. కాలుష్య సమస్యలు తలెత్తవు. అదొక్కటే ఇందులోని ప్లస్ పాయింట్. ఇది చైనా ఇచ్చిన మొదటి బస్సు మాత్రమే. వీటి సరఫరా కోసం చైనాతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే సమాచారం తెలియరాలేదు.