సాధారణంగా నదుల మీద, వాగులు వంకల మీద బ్రిడ్జిలను నిర్మిస్తారు. కొన్ని చోట్ల సముద్రాల మీద కూడా వంతెనలు నిర్మించారు. మన దేశంలో రామేశ్వరం రైల్వే బ్రిడ్జి పూర్తిగా సముద్రం మీదే నిర్మించారు. ఆయా అవసరాల కోసం తగినట్లుగా బ్రిడ్జిలను నిర్మిస్తారు. కానీ, ప్రపంచంలో కొన్ని వంతెనలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ వంతెనలు ఏకంగా దేశాలు, ఖండాలను అనుసంధానిస్తున్నాయి. ప్రజలు, ప్రదేశాల మధ్య కనెక్టివిటీని పెంచుతున్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశాలను కలిపే వంతెనలు
⦿ ఒరేసుండ్ వంతెన
ఈ వంతెన డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ ను స్వీడన్ లోని మాల్మోతో కలుపుతుంది. ఈ వంతెన ఏకంగా 8 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో 4 కిలోమీటర్లు నీటి అడుగు భాగంలో సొరంగ మార్గాన్ని కలిగి ఉంటుంది. ఈ వంతెనను 2000లో ప్రారంభించారు. ఈ మార్గం ద్వారా వాహనాలు, రైళ్లు ప్రయాణం చేస్తాయి. ప్రతిరోజూ, దాదాపు 70,000 మంది ప్రయాణాలు కొనసాగిస్తారు. ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది యూరప్‌లోని రెండు దేశాల మధ్య సూపర్ హైవేలా పని చేస్తుంది.
⦿ అంబాసిడర్ వంతెన
ఈ వంతెన అమెరికాలోని డెట్రాయిట్‌ను కెనడాలోని విండ్సర్ తో కలుపుతుంది. ఈ వంతెన 2.3 కిలో మీటర్ల పొడవున డెట్రాయిట్ నదిపై నిర్మించారు. 1929లో నిర్మించిన ఈ వంతెన వాణిజ్య పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రతి రోజు వేలాది ట్రక్కులు దీని మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయి.
⦿ ఫ్రెండ్ షిప్ బ్రిడ్జ్
ఈ వంతెన బ్రెజిల్ లోని ఫోజ్ డో ఇగువాకును పరాగ్వేలోని సియుడాడ్ డెల్ ఎస్టేకు కలుపుతుంది. ఈ వంతెన 552 మీటర్లు పొడవు ఉంటుంది. పరానా నది మీదుగా దీనిని నిర్మించారు. 1965లో ఈ వంతెనను ప్రారంభించారు. ఇది దక్షిణ అమెరికాలో వర్తక వ్యాపారాలకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వంతెనపై విపరీతమైన రద్దీ ఉండటంతో ట్రాఫిక్ సమీపంలో మరో వంతెన నిర్మించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
⦿ సెకండ్ సెవెర్న్ క్రాసింగ్
ఈ వంతెన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లాండ్, వేల్స్ ను కలుపుతుంది. ఇది 5.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సెవెర్న్ నదీ మీదుగా కొనసాగుతుంది. 1996లో ఈ వంతెనను ప్రారంభించారు. UKలోని ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం, వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది.
ఖండాల మధ్య వంతెనల కోసం ప్రయత్నాలు
దేశాలను మాత్రమే కాదు, ఖండాలను కలిపేలా వంతెనలను నిర్మించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వాటిని అనుసంధానం చేసేందుకు వంతెనలు, సొరంగాలు నిర్మించాలంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అందుకే, ఇంకా ఆలోచనలుగానే ఉన్నాయి.
⦿ బేరింగ్ స్ట్రెయిట్ బ్రిడ్జి
ఈ వంతెనను ఆసియాలోని రష్యా, USAలోని అలాస్కా మధ్య వంతెనను నిర్మించాలనే ప్రయత్నం జరిగింది. ఇది బేరింగ్ జలసంధిని దాటుతూ వెళ్తుంది. 80 నుంచి 100 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. ఇది బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చయ్యే భారీ ప్రాజెక్ట్. దీనిని నిర్మిస్తే.. ప్రజలు ఆసియా నుంచి ఉత్తర అమెరికాకు రైలు, వాహనాలను నడిపే అవకాశం ఉంటుంది. కానీ, చల్లని వాతావరణం, లోతైన నీటి కారణంగా దీనిని నిర్మించడం కష్టం అని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
⦿ జిబ్రాల్టర్ జలసంధి వంతెన
యూరప్‌లోని స్పెయిన్ ను జిబ్రాల్టర్ జలసంధి మీదుగా ఆఫ్రికాలోని మొరాకోకు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ప్రణాళి. ఇది 14 కిలోమీటర్ల మేర వంతెన లేదంటే సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. నీరు చాలా లోతుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మిణం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ నిర్మిస్తే యూరప్, ఆఫ్రికా మధ్య ప్రయాణం, వాణిజ్యం మరింత సులభతరం అవుతుంది.
⦿ ఎర్ర సముద్ర వంతెన
ఆసియాలోని సౌదీ అరేబియా, ఆఫ్రికాలోని ఈజిప్ట్ మధ్య ఎర్ర సముద్రం దాటేందు కోసం వంతెనను నిర్మించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది వ్యాపార, మతపరమైన ప్రయాణాల కోసం వెళ్లే ప్రజలకు సహాయపడుతుంది. ఇది సౌదీ అరేబియాలో విజన్ 2030 అనే ప్రణాళికలో ఒక అంశంగా చేర్చింది. కానీ, ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.