108 దేశాలు.. 108 మంది కంటెస్టెంట్లు.. ఫైనల్స్ కు నలుగురు. ఒకే కిరీటం. అంతకు మించిన భావోద్వేగం. యావత్ ప్రపంచమంతా హైదరాబాద్ వైపే చూపు.. శనివారమే గ్రాండ్ ఫినాలే. ప్రపంచమంతా లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు ప్రపంచదేశాలను మిస్ వరల్డ్ మేనియా చుట్టేసింది. జగజ్జేత ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి వరకు జరగని విధంగా గ్రాండ్ ఫినాలేకు దేశ విదేశీ డిజైనర్లతో అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయ్.
నెల రోజులు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా..
బ్యూటీ విత్ పర్పస్ తో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు క్లైమాక్స్ కు చేరాయి. గ్రాండ్ ఫినాలేకు హైటెక్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అతిథులను అలరించేలా.. యావత్ ప్రపంచాన్ని మురిపించేలా.. అందరినీ కట్టి పడేసేలా.. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అడుగు దూరంలో నిలిచింది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు మొదలై రాత్రి తొమ్మిదిన్నరకు వేడుక ముగుస్తుంది. మిస్ వరల్డ్ ఎవరో తేలిపోతుంది. నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ జరూర్ ఆనా అన్న స్లోగన్ ను జత చేసింది. ప్రపంచదేశాల దృష్టి తెలంగాణపై, హైదరాబాద్ పై పడేలా గ్లోబల్ అటెన్షన్ సాధించడంలో సక్సెస్ అయింది.
సీఎం రేవంత్ సరికొత్త ఆలోచనతో..
అందాల పోటీలు అంటే వివిధ దేశాల నుంచి కంటెస్టెంట్లు రావడం, పోటీల్లో పాల్గొనడం, వారి పనేదో వారు చూసుకుని విజేతను ప్రకటించేసి వెళ్లడం ఇదే జరుగుతోంది. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. ఈ మెగా బ్యూటీ ఈవెంట్ ను తెలంగాణకు బూస్టప్ వచ్చేలా చేయడంలో సరికొత్తగా ఆలోచించారు. వందకు పైగా దేశాల నుంచి సుందరీమణులు, మీడియా, వారి ప్రతినిధి బృందాలను తెలంగాణలోని ఫేమస్ టూరిస్ట్ ప్రాంతాలకు పంపించారు. అక్కడ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా నిర్వహించారు. ప్రపంచదేశాల్లో మంచి కవరేజ్ వచ్చేలా చూసుకున్నారు. శెభాష్ అనిపించుకున్నారు.
ఎన్నో ‘ఛాలెంజ్’లు
మిస్ వరల్డ్ ఈవెంట్ లో అసలు సిసలైన ఆఖరి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ గ్రాండ్ ఫినాలేను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు. సో ఆ ఈవెంట్ ను అంతే ఘనంగా నిర్వహించబోతున్నారు. హైటెక్స్ లో జరిగే ఈ ఫైనల్స్ కు ఏర్పాట్లు అదిరిపోతున్నాయ్. విదేశాల నుంచి వచ్చిన స్పెషల్ డిజైనర్లు ప్రధాన వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ నుంచి మొదలైన పోటీలు.. 5 ఫాస్ట్ ట్రాక్ ఛాలెంజెస్ తో ఫైనలిస్టులు ఖరారయ్యారు. తొలి ఛాలెంజ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ లో భాగంగా కంటెస్టెంట్ల సోషల్ సర్వీస్ కు సంబంధించి ఏం చేశారో చూశారు. సెకెండ్ మల్టీమీడియా ఛాలెంజ్ లో కంటెస్టెంట్ల సోషల్ మీడియా నైపుణ్యాలు, బ్లాగింగ్, పబ్లిక్ రిలేషన్స్, సోషల్ మీడియాలో క్రేజ్ ఎంత ఉందో చూసి విజేతలను సెలెక్ట్ చేశారు. ఇక స్పోర్ట్స్ ఛాలెంజ్ లో ఫిజికల్ ఫిట్ నెస్, స్పోర్ట్స్ స్కిల్స్ ను టెస్ట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా ఈ ఛాలెంజ్ ను డిజైన్ చేశారు. టాలెంట్ ఛాలెంజ్ లో కంటెస్టెంట్ల.. మ్యూజిక్, డ్యాన్స్, కవిత్వం వంటి తమ ప్రతిభల్లో హైలెట్ ఉన్న వారిని సెలక్ట్ చేశారు. ఇక ఫైనల్ గా టాప్ మోడల్ ఛాలెంజ్ లో కంటెస్టెంట్ల ర్యాంప్ వాక్ తీరు, ఫ్యాషన్ సెన్స్ ను పరీక్షించారు. సో ఫైనల్ స్టెప్ రానే వచ్చింది.
ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఎంపిక
ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో ఒక్కో ఖండం నుంచి పదేసి మందిని ఎంపిక చేశారు. అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశలో 5 గురిని ఎంపిక చేశారు. ఈ 5 గురిలో మూడో దశలో ఇద్దరిని ఎంపిక చేశారు. పోటీలో 8 మంది నిలవగా, ఈ 8 మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్‌గా ఫైనలైజ్ చేశారు. అలా ప్రతి ఖండం నుంచి మిగిలిన ఒక్కరి మధ్య ఫైనల్ పోటీ జరగబోతోంది. ప్రస్తుతం ఫైనల్ లో నిలిచిన నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్‌కు చెందిన ఆరెలీ జోచిమ్‌లు ఎంపికయ్యారు. శనివారం గ్రాండ్ ఫినాలేలో పాల్గొనేది ఈ నలుగురే. వారిలో ఒకరిని వరించబోతోంది మిస్ వరల్డ్ కిరీటం. మిగిలిన ముగ్గురిని ప్రతిభను బట్టి రన్నరప్‌లుగా ప్రకటిస్తారు. కొత్త విజేతకు గతేడాది మిస్ వరల్డ్ క్రిస్టినా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో వేడుక ముగుస్తుంది.
శనివారం సాయంత్రం ఫైనాలే మొదలు
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో భాగంగా రెడ్ కార్పెట్ ఈవెంట్ శనివారం సాయంత్రం ఐదున్నరకు మొదలవుతుంది.. ఈ పోటీల్లో నలుగురు ఫైనల్ కంటెస్టెంట్లను అడిగే చివరి ప్రశ్న.. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారు? వారిచ్చే సమాధానం ఆధారంగా మిస్ వరల్డ్ ఎవరన్నది తేలుతుంది. తెలంగాణ, జరూర్ ఆనా స్లోగన్‌తో తెలంగాణ పర్యటక శాఖ ఈ పోటీల నిర్వహణలో కో-హోస్ట్ బాధ్యతలు తీసుకుంది. తెలంగాణ టూరిజానికి ఒక బ్రాండింగ్ తీసుకురావడం, ఇక్కడి ఉత్పత్తులకు, కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవడం, గ్లోబల్ అటెన్షన్ సాధించడం లక్ష్యంగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
రూ.27 కోట్లతో.. అత్యంత ఘనంగా..
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. వివిధ దేశాల నుంచి ఈ పోటీలకు వచ్చిన పోటీదారులంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యటక ప్రాంతాలైన నాగార్జునసాగర్‌లోని బుద్ధిస్టు థీమ్ పార్క్, హైదరాబాద్‌లో చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలస్, ఓరుగల్లు కోట, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో సందడి చేశారు. తెలంగాణ సచివాలయానికి కూడా వెళ్లారు. ఈ పోటీల నిర్వహణకు 27 కోట్ల దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టారంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం 200 కోట్ల దాకా అయ్యాయంటున్నాయి.
మిల్లా వివాదం.. చివరికి..
మిస్ వరల్డ్ పోటీల్లో ఒక వివాదం చుట్టుముట్టింది. కంటెస్టెంట్లలో ఒకరైన మిస్ ఇంగ్లండ్ 2024 మిల్లా మాగీ అర్ధాంతరంగా పోటీల నుంచి తప్పుకుంది. స్వదేశానికి వెళ్లాక ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఈ కామెంట్లపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు కమిటీ వేసింది. అసలు వాస్తవాలు తేల్చింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా తన వివరణతో ప్రకటన విడుదల చేసింది. సో వివాదానికి అలా ముగింపు పలికి ఫైనల్స్ కు ఫుల్ జోష్ తో ముందడుగు వేశారు.
3,500 మంది సమక్షంలో…
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సీఎం రేవంత్ సహా మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా 3,500 మంది హాజరవుతారని అంచనా. ఫైనల్ పోటీల్లో ప్రముఖ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఏటా మిస్ వరల్డ్ ఫైనల్లో ఇచ్చే హ్యుమానిటేరియన్ పురస్కారాన్ని ఈసారి సోనూసూద్‌కు ఇవ్వబోతున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ లో తెలుగు వెలిగింది. మిస్ కెనడా.. తెలుగులో నమస్తే.. ఎలా ఉన్నారు అని సందడి చేయగా, మిస్ యూఎస్‌ఏ.. అందరూ బాగున్నారా అంటూ పలకరించడం హైలెట్. మిస్ అర్జెంటీనా ఐతే ఫేమస్ తెలుగు డైలాగ్ తగ్గేదే లే అంటూ అలరించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ జర్మనీ బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా పాట పాడి అందరి మనసులూ దోచుకున్నారు. సో ఇలాంటి గ్లింప్సెస్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో మధురమైన అనుభూతులను నింపింది ఈ మిస్ వరల్డ్ మెగా కాంటెస్ట్.
అందుకే.. ‘బ్యూటీ విత్ పర్పస్’
బ్యూటీ విత్ పర్పస్ అని ఈ మిస్ వరల్డ్ పోటీలకు క్యాప్షన్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది పేరుకు అందాల పోటీనే. కానీ మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది.. తోటి మనుషుల పట్ల ఎలా ఉన్నాం.. పర్యావరణాన్ని ఎలా ప్రేమిస్తున్నాం.. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాం.. మంచి జీవనశైలి ఎలా పాటిస్తున్నాం.. మనకున్న టాలెంట్ ను ఎలా ప్రదర్శిస్తున్నాం.. ఇలాంటివన్నీ ప్రతిబింబిస్తుంది ఈ వరల్డ్ మెగా ఈవెంట్. జస్ట్ రావడం పోవడం కాదు.. అనాధ పిల్లల్లో ఆనందాన్ని నింపారు కంటెస్టెంట్లు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో తిరిగి అందరి మనసు ఆకట్టుకున్నారు. మన ఆతిథ్యాన్ని ఆస్వాదించారు. ఈ నెల రోజులు అదుర్స్ అనిపించారు. మన గురించి వారి వారి దేశాల్లో గొప్పగా చెబుతున్నారు. వారి వారి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతున్నారు.
విజేతకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ
అందం అంటే బాహ్య స్వరూపం కాదు.. అంతఃసౌందర్యం అని నిరూపించే కంటెస్టే.. మిస్ వరల్డ్ ఈవెంట్. అవును ఏదో వచ్చాం.. పోటీల్లో పాల్గొన్నాం.. వెళ్లిపోయాం అన్నట్లు కాకుండా చాలా పకడ్బందీగా.. కంటెస్టెంట్లు గుండెల నిండా సంతోషాన్ని నింపుకొని వెళ్లేలా ఈసారి మిస్ వరల్డ్ పోటీలను డిజైన్ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చూడండి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు.. 200 మంది అనాథ పిల్లలతో ఆడిపాడారు. ఫార్చూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మిస్ వరల్డ్ పోటీదారులు సహా మిస్ వరల్డ్ – 2024 క్రిస్టినా హాజరయ్యారు. ఈ అనాధ పిల్లలకు 20 రకాల వస్తువులతో కూడిన కిట్‌లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అందించారు. ఈ సమయంలో చాలా మంది చిన్నారులు కంటతడి పెట్టుకోగా కంటెస్టెంట్లు ఓదార్చారు. ఆ తర్వాత లైవ్ బ్యాండ్ కార్యక్రమంలో తెలుగు పాటలకు స్టెప్పులు వేసి అందరినీ సంతోషపెట్టారు. ఈ కార్యక్రమం మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల మనసును తాకింది.
సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ను సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని అందరికీ చూపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో నిర్వహించారు. నిజానికి ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి తెలంగాణ పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ డిపార్ట్ మెంట్ చాలా శ్రమించింది కూడా. కంటెస్టెంట్లకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణను విజిట్ చేసే విదేశీ పర్యాటకుల సంఖ్య పెంచేలా ఈ కార్యక్రమాన్ని అవకాశంగా వినియోగించుకుంది ప్రభుత్వం.
టూరిజానికి బూస్ట్…
చారిత్రక నేపథ్యం కోసం చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, రామప్ప ఆలయం, సాంస్కృతిక వైవిద్యాన్ని చూపించేలా పోచంపల్లి, టెక్నాలజీ కోసం టీ హబ్, సేఫ్టీ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, వైద్య సదుపాయాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులను చూపేందుకు AIG హాస్పిటల్ వెళ్లడం ఇవన్నీ ఎక్స్ ప్లోర్ చేయించారు. మెడికల్ టూరిజం ఎలా పెరిగిందో చూపించారు. పిల్లల మర్రి, రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివెన్నో వారిని ఆకర్షించాయి. వారి వారి దేశాలకు వెళ్లిన తర్వాత ఈ రంగాలకు మరింత ప్రాధాన్యం కల్పించేలా చూసుకుంటున్నారు.
ఇండియాలో ఇది మూడోసారి
భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది మూడోసారి. తొలిసారి 1996లో బెంగళూరులో నిర్వహించారు. వీటి నిర్వహణలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన ఏబీసీఎల్ కంపెనీ నాడు కీలక పాత్ర పోషించింది. రెండోసారి 2024లో ముంబయి, ఢిల్లీలో నిర్వహించారు. మార్చి 9న ముంబైలో జరిగిన ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. బ్యూటీ విత్ పర్పస్ కు, తెలంగాణ జరూర్ ఆనా క్యాప్షన్ జత చేసింది. విజయవంతమైంది. విజేతకు మిస్ వరల్డ్ కిరీటంతో పాటుగా కళ్లు చెదిరే ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. విజేతకు 1 మిలియన్ డాలర్ అంటే మన కరెన్సీలో 8.5 కోట్ల రూపాయలు దక్కుతాయి. ఈ ప్రైజ్ మనీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, ప్రధాన స్పాన్సర్ల ద్వారా లభిస్తుంది.
Also Read: ఆ నటి స్నానం నీటితో సబ్బులు తయారీ.. ఒక్కో సోప్ ధర ఎంతో తెలుసా?
కిరీటం ఎవరికి దక్కనుంది?
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రితో రాజ్ భవన్‌లో కొత్త మిస్ వరల్డ్ సమావేశమవుతారు. ఇప్పటి వరకు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడంలో ఇండియా, వెనిజులా అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ నుంచి ఆరుగురు ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ అయ్యారు. వెనిజులా కూడా ఆరుసార్లు కిరీటం గెలుచుకుని ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే ఐదుసార్లు, యూఎస్ఏ, సౌతాఫ్రికా చెరో మూడుసార్లు కిరీటం గెలిచాయి. తాజా పోటీలో ఎవరికి కిరిటం దక్కబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి భారత్ గెలిస్తే మిస్ వరల్డ్ ఎక్కువసార్లు గెలిచిన రికార్డు సొంతమవుతుంది.
Story By: Vidyasagar. K