Bullet Train In India: భారతీయ రైల్వే సంస్థ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, ఇక బుల్లెట్ రైళ్లపై ఫోకస్ పెట్టింది. దేశంలో 2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు తీసేలా చర్యలు తీసుకుంటున్నది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్(MAHSR) పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. 2026 నాటికి దక్షిణ గుజరాత్ లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశలో బుల్లెట్ రైలును నడిపించాలని భావిస్తున్నది. సివిల్ స్ట్రక్చర్స్, ట్రాక్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రైన్ సెట్ల సరఫరాకు సంబంధించిన అన్ని పనులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నది.
క్లిష్టమైన టెక్నాలజీతో కూడిన ప్రాజెక్ట్
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైన, లేటెస్ట్ సాంకేతికతతో కూడిన ప్రాజెక్ట్. అత్యున్నత స్థాయి భద్రత, మెయింటెనెన్స్ ప్రోటోకాల్ ను పరిగణనలోకి తీసుకుని నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ జపాన్ రైల్వే సాకారంతో రూపొందుతున్నది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1389.5 హెక్టార్ల భూమిని అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు 350 కి.మీ పీర్ ఫౌండేషన్, 316 కి.మీ పీర్ నిర్మాణం, 221 కి.మీ గిర్డర్ కాస్టింగ్, 190 కి.మీ గర్డర్ లాంచింగ్ పనులు పూర్తయ్యాయి. సముద్రగర్భంలో టన్నెల్ (సుమారు 21 కి.మీ) పనులు కూడా మొదలయ్యాయి.
రూ. లక్ష కోట్లతో MAHSR ప్రాజెక్టు పనులు
ఇక ఈ ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టును 508 కిలో మీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 1,08,000 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్రతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ మీదుగా వెళ్తున్నది. ఈ బుల్లెట్ రైలు 12 స్టేషన్లలో ఆగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబయి, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. భారత్ లో ప్రారంభం కాబోయే తొలి బుల్లెట్ రైలు భారతీయ అవసరాలకు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నిర్మిస్తున్నారు.
Read Also: సంక్రాంతికి మరో 60 స్పెషల్ రైళ్లు, సౌత్ సెట్రల్ రైల్వే గుడ్ న్యూస్!
ఈ బుల్లెట్ రైల్లో టికెట్ ధరలు ఎంత ఉండొచ్చంటే?
బుల్లెట్ రైలు టికెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ముంబై- అహ్మదాబాద్ మధ్య ప్రయాణీకులు వారి గమ్య స్థానాన్ని బట్టి రూ. 250 నుంచి రూ. 3,000 వరకు ఉంటుదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య అత్యధికంగా రూ. 3,000 వరకు ఉండగా, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)-థానే మధ్య అతి తక్కువగా రూ. 250 వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాతే టికెట్ ధరపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Also: ప్రధాని చేతుల మీదుగా జమ్మూ రైల్వే డివిజన్ ప్రారంభం, కాశ్మీర్ లో మరింత పెరగనున్న రైల్వే కనెక్టివిటీ!