సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య దూరం 700 కిలోమీటర్లు
వందే భారత్ ట్రైన్ లో ప్రయాణ సమయం 8 గంటల 30 నిమిషాలు
బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 3 గంటలు
అంటే సగంకంటే మరింత తక్కువ అనమాట. ఒకవేళ మనం విమానంలో వెళ్లాలన్నా కూడా ఎయిర్ పోర్ట్ కి వెళ్లే సమయం, చెక్ ఇన్, చెక్ ఔట్ సమయం, మిగతా అంతా కలుపుకొంటే 3 గంటలకంటే ఎక్కువే కావొచ్చు. సో.. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే మిగతా అన్ని ప్రయాణ మార్గాలకంటే సమయం కచ్చితంగా ఆదా అవుతుంది.
చార్జీలు భరించాల్సిందే..
బుల్లెట్ వేగంతో వెళ్లాలంటే కాస్త ఎక్కువ చార్జీ అయినా భరించాల్సిందే. ప్రస్తుతం వైజాగ్ టు సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ లో గరిష్ట చార్జి 3120 రూపాయలుగా ఉంది. అదే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే చార్జ్ గరిష్టంగా 5800 రూపాయల వరకు ఉంటుంది. ప్రీమియం చార్జ్ 8500 రూపాయల వరకు ఉండొచ్చు. బుల్లెట్ ట్రైన్ వస్తేగనక విశాఖ నుంచి విజయవాడకు కేవలం గంటలో చేరుకోవచ్చు. విజయవాడనుంచి సికింద్రాబాద్ కేవలం గంటా 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. దానికి తగ్గట్టే చార్జీలు కూడా భరించాల్సి ఉంటుంది.
జపాన్ లో టికెట్ రేటు ఎంత..?
బుల్లెట్ ట్రైన్లకు ఆరిజిన్ గా పిలుచుకునే జపాన్ లో కూడా టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే వీటిలో ఉండే సౌకర్యాన్ని బట్టి ఆ రేటు పెట్టడానికి ప్రయాణికులు పెద్దగా ఇబ్బంది పడరు. టోక్యో నుంచి హిరోషిమాకు దాదాపు 820 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రెండు పట్టణాల మధ్య ప్రయాణం చేయాలంటే వన్ వే టికెట్ ధర మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,285
ఇండియాలో ఎప్పుడు..?
భారతీయులకు బుల్లెట్ ట్రైన్ అనేది పెద్ద కల. ఈపాటికే ఇది అందుబాటులోకి రావాల్సి ఉన్నా వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోతోంది. స్థల సేకరణ, కొవిడ్ కారణంగా కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడటంతో మరింత ఆలస్యం అవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2028 నాటికి భారత్ లో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది.
మొదటి ట్రైన్ ఎక్కడ..?
ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మొదటి బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం రెండున్నర గంటల్లోనే 508 కిలోమీటర్లు ప్రయాణించేలా తొలి ట్రైన్ ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ కి విమాన ప్రయాణం కన్వీనియంట్ గా ఉంటుంది. సాధారణ డిమాండ్ ఉన్న టైమ్ లో ఎకానమీ క్లాస్ టికెట్ రేటు రూ.2,000 నుంచి రూ.3,500 వరకు ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ టికెట్ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఉండబోతోంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రస్తుతం రైలు మార్గంలో ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటలుగా ఉంటోంది. బుల్లెట్ ట్రైన్ వస్తే ప్రయాణ సమయం కేవలం 2 నుంచి 3 గంటలకు చేరుకుంటుంది. అయితే దీనికోసం ప్రత్యేక మైన ట్రాక్ వేయాల్సి ఉంటుంది. ఇది కేవలం బుల్లెట్ ట్రైన్స్ కోసమే వినియోగిస్తారు. ముంబై సమీపంలో 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భంలో రైల్వే ట్రాక్ వేస్తారు. 2017లో నిర్మాణం ప్రారంభం కాగా.. 2028నాటికి తొలి రైలుని పట్టాలెక్కించే అవకాశం కనపడుతోంది.
జపాన్ సహకారం..
భారత్ లో బుల్లెట్ ట్రైన్ కి జపాన్ సహకారం అందిస్తోంది. షింకన్‌సెన్ (E5 సిరీస్) టెక్నాలజీని మనకు అందిస్తోంది జపాన్. ఈ టెక్నాలజీతో ట్రైన్ గంటకు 320 కిలో మీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్స్ వ్యవహారంలో జపాన్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంది. ఆ టెక్నాలజీతోనే భారత్ లో కూడా బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.