Guwahati Bullet Train Link: దేశంలో బుల్లెట్ రైలు ప్రయాణం మరిన్ని ప్రాంతాలకు విస్తరించేలా కేంద్రం ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే ఈశాన్య భారతానికి కూడా హైస్పీడ్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అస్సాం రాజధాని గౌహతిని బుల్లెట్ రైలు నెట్ వర్క్ తో అనుసంధానించేందుకు ఆమోదం లభించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే పలు సాంకేతిక, నిర్మాణపరమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంది.
న్యూఢిల్లీ నుంచి ఈశాన్య ప్రాంతాలను బుల్లెట్ రైళ్ల ద్వారా అనుసంధానించే ప్రతిపాదనలో భాగంగా గౌహతిని చేర్చేందుకు అనుమతి లభించిందని హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. గతంలో ఈ ప్రతిపాదనపై కొన్ని అభ్యంతరాలు, సవాళ్లు ఎదురైనా.. వారితో జరిపిన చర్చల అనంతరం సానుకూల నిర్ణయం వచ్చిందని వెల్లడించారు.
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన అంశం సిలిగురి కారిడార్. దీనినే చికెన్ నెక్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం ద్వారానే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు రవాణా జరుగుతుంది. కొన్ని చోట్ల ఈ కారిడార్ వెడల్పు కేవలం 16 నుంచి 22 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జాతీయ రహదారి, సాధారణ రైల్వే మార్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుల్లెట్ రైలు కోసం అదనపు మార్గాన్ని నిర్మించడం అధికారులకు పెద్ద సవాలుగా మారనుంది.
ఈ కారిడార్ లో బుల్లెట్ రైలు మార్గాన్ని భూమిపైన నిర్మించాలా? లేక భూగర్భంలో ఏర్పాటు చేయాలా? అనే అంశంపై సాంకేతికంగా అధ్యయనం చేయాల్సి ఉందని సీఎం తెలిపారు. సాధారణ రైల్వే పట్టాలపై బుల్లెట్ రైళ్లను నడపడం సాధ్యం కాదని, వీటి కోసం పూర్తిగా ప్రత్యేకమైన రైల్వే కారిడార్ అవసరమన్నారు. నిర్మాణ పద్ధతిని బట్టి ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. సాధారణ ప్రాజెక్టులతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్ అవసరమయ్యే అవకాశముందని వివరించారు.
గౌహతికి బుల్లెట్ రైలు లింకేజ్ కు వచ్చిన ఆమోదం తొలి అడుగు మాత్రమేనని హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. సర్వేలు, రూట్ అలైన్‌మెంట్, టెక్నికల్ సమస్యలు, నిర్మాణ విధానం సహా పలు అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ అంశాలపై మరింత చర్చించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గౌహతితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు దేశంలోని ఇతర ప్రాంతాలతో వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు.. 20 అద్భుతమైన ఫీచర్లు ఇవే?