Rajasthan Railway Track Explosion: రాజస్థాన్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు కలకలం రేపింది. శ్రీ గంగానగర్ జిల్లాలోని అనూప్‌గఢ్ సమీపంలో రైల్వే పట్టాల కింద భారీ పేలుడు సంభవించడంతో రెండు కాంక్రీట్ దిమ్మెలు ధ్వంసమయ్యాయి. ట్రాక్ మధ్యలో సుమారు రెండు అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు భద్రతా సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి.
శ్రీ గంగానగర్ జిల్లా రామ్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో ఈ ఘటన జరిగింది. అనూప్‌గఢ్‌లోని 50 జీబీ గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. అంతకుముందు అదే మార్గంలో ఓ ప్యాసింజర్ రైలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. రైలు వెళ్లిన దాదాపు 45 నిమిషాల తర్వాత పేలుడు జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
పేలుడు ధాటికి పట్టాల కింద ఏర్పాటు చేసిన రెండు కాంక్రీట్ బ్లాక్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రాక్ మధ్యలో సుమారు రెండు అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. రైల్వే మార్గానికి నష్టం జరగడంతో అధికారులు వెంటనే రాకపోకలను నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఇవాళ ఉదయం 6 గంటల వరకు నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఈ ఘటన జరగడంతో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఏటీఎస్, సీఐడీ, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. రైల్వే అధికారులు కూడా ట్రాక్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు ఏంటి? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
ఈ ఘటన బాంబు పేలుడేనని ఇప్పటి వరకు అధికారులు నిర్ధారించలేదు. ఫోరెన్సిక్, ఏటీఎస్ బృందాలు ప్రాథమికంగా పరిశీలించినప్పటికీ, పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు విషయం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల స్వాధీనం చేసుకున్న 7.5 కిలోల ఆర్‌డీఎక్స్‌కు ఈ ఘటనకు సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవల భిల్వారాలో పేలుడు పదార్థాలతో వెళ్తున్న పికప్ ట్రక్ పేలడంతో డ్రైవర్ మరణించిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. అయితే, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా? అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. అనూప్‌గఢ్ రైల్వే ట్రాక్ పేలుడు వెనుక అసలు కారణమేంటన్నది త్వరలోనే దర్యాప్తులో తేలనుంది.
Read Also: ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు.. 20 అద్భుతమైన ఫీచర్లు ఇవే?