E-Paper
Advertisement

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?
Advertisement

ఒక్కోసారి వర్షం పడుతున్నప్పుడు చేపలు కూడా ఆకాశం నుంచి పడుతుంటాయి. ఈ ఘటనకు కారణం.. టొర్నడోస్ లేదా సుడిగాలులు. అవి చెరువులు, నదుల మీద నుంచి వెళ్లేప్పుడు.. నీటిలో ఉండే చేపలు సైతం సుడిగాలుల్లో చిక్కుకుని మేఘాల్లోకి చేరుకుంటాయి. వర్షం పడినప్పుడు.. అవి నీటి చినుకులతో పాటు నేలపై పడతాయి. ఇటీవల చేపల వర్షం అనేది సర్వసాధారణం అయిపోయింది. దానికి కారణాలు కూడా తెలిసిపోవడంతో జనాలు దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. అయితే, మీరు ఎప్పుడైనా మాంసం ముద్దల వాన గురించి విన్నారా? ఒకప్పుడు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘటన ఇది.

ఎప్పుడు? ఎక్కడ జరిగింది?

అది 1841. అమెరికాలోని టెన్నెసీలోని లెబనాన్ సమీపంలోని ఓ పొగాకు తోటలో ఇద్దరు రైతులు పనిలో నిమగ్నమై ఉన్నారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో వారికి వడగాళ్ల వాన పడుతున్న శబ్దం వినిపించింది. నేలపై చూస్తే.. ఎర్రగా మాంసం ముద్దలు కనిపించాయి. ఆకాశం వైపు చూస్తే.. ఎర్రని చినుకులు టపాటాపా అంటూ వాళ్ల మీద పడుతున్నాయి. వారి చుట్టూ ఎర్రని మాంసం ముక్కలు, కొవ్వు పదార్థాలు.. వాటిని చూడగానే వారికి నోట మాట రాలేదు. వెంటనే అక్కడి నుంచి కేకలు పెడుతూ.. పరిగెట్టడం మొదలుపెట్టారు. వారి అరుపులకు అక్కడే ఉన్న జనం.. అటుగా పరిగెట్టుకుంటూ వచ్చారు. పొగాకు తోట మొత్తం మాంసం ముద్దలు, ఎర్రని రక్తంతో నిండిపోవడంతో భయాందోళనలకు గురయ్యారు.

అవి మాంసం ముద్దలేనా?

Advertisement

మాంసం ముద్దల వాన గురించి చుట్టుపక్కల ఊళ్లకు దావనంలా పాకింది. ఆకు పచ్చగా ఉండాల్సిన పొగాకు తోట మొత్తం ఎర్రబడింది. అక్కడ పడి ఉన్న మాంసం ముద్దల నుంచి ముక్కులు పగిలేంత దుర్వాసన వస్తోంది. దీంతో చాలామంది దేవుడు ఆగ్రహించాడని, అందుకే రక్తమాంసాలతో కూడిన వర్షంతో హెచ్చరికలు పంపాడనే ప్రచారం మొదలైంది. కొందరైతే వేరే గ్రహం నుంచి పడి ఉంటాయని కొత్త కథలు సృష్టించారు. దీని గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. వెంటనే తమ సిబ్బందిని అక్కడికి పంపి.. అక్కడి పదార్థాలను సేకరించారు. అసలు అవి మాంసం ముద్దలేనా? అయినా అవి ఆకాశం నుంచి ఎలా పడ్డాయి? అనే సందేహాలతో శాస్త్రవేత్తలు వాటిని లోతుగా పరిశీలించారు.

అసలు నిజం ఏమిటంటే?

నాష్‌విల్లే విశ్వవిద్యాలయంలో రసాయన, ఖనిజ శాస్త్రల బోధకుడు, ప్రకృతి శాస్త్రవేత్త గెరార్డ్ ట్రూస్ట్ ఆ పదార్థాలను పరిశీలించారు. ఆ మాంసం నుంచి వస్తున్న దుర్వాసన కుళ్లిపోయిన జంతు కళేబరాల మాదిరిగా ఉందని గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఒక ఆసక్తికర ప్రయోగం చేశారు. ఆ మాంసం ముక్కలను, రక్తంలా కనిపిస్తున్న ఎర్రటి పదార్థాలను ఒక గాజు గొట్టంలో వేసి వేడి చేశారు. అవి మాంసాన్ని వేడి చేసినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అలాగే మార్పు చెందాయి. వాటి నుంచి గోధుమ రంగు ద్రవం పైకి చేరింది. దీంతో ఆయన అసలు విషయాన్ని గుర్తించారు.. ఆ రక్తమాంసాలు ఏదో గ్రహంతర పదార్థం కాదని, అలాగే దేవుడి హెచ్చరిక కూడా కాదని వెల్లడించారు. అది భూమిపై నివసించే ఏదో జంతువుకు చెందిన శరీర భాగాలని స్పష్టం చేశారు.

మరి ఆకాశం నుంచి ఎందుకు పడ్డాయి?

Advertisement

మరి ఆ మాంసం ముద్దలు ఆకాశం నుంచి ఎలా పడ్డాయనేగా మీ సందేహం? దీనికి సమాధానం ముందే చెప్పేసుకున్నాం. ఇది కూడా చేపల వర్షం తరహా ఘటనే. సుడిగాలి వల్ల భూమిపై కుళ్లిపోయిన జంతు కళేబరంలోని మాంసపు ముక్కలు.. పైకి వెళ్లి మేఘాల్లోకి చిక్కుకున్నాయి. చివరికి వర్షం పడినప్పుడు ఆ మాంసం ముద్దలు నేలపై పడ్డాయని ట్రూస్ట్ వివరించారు. అయితే, అప్పట్లో ప్రజలకు సైన్స్ గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల.. శాస్త్రవేత్తల మాటలను పట్టించుకోలేదు. అది ఖచ్చితంగా దేవుడి శాపమే అని నమ్మారు. అది అంతటితో ఆగలేదు.. అది రక్తపు వర్షం కాదని.. బానిసత్వ తిరుగుబాటు హెచ్చరిక అని మరో వదంతి లేపారు. ఆ పొలంలో పనిచేస్తున్న వారిద్దరు బానిసలని, వారే కావాలని ఒక పందిని చంపేసి.. దాని మాంసం ముద్దలు, రక్తాన్ని పొలం అంతా చల్లారనే వార్తలు వచ్చాయి. అయితే, నిజంగానే వర్షం అని స్థానికులు వాదించారు. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు. కానీ, ఎవరూ నమ్మలేదు.

నాట్ టర్నర్ తిరుగుబాటుతో లింకు..

ఈ ఘటన.. అమెరికాలో బానిసత్వంపై చర్చ జరిగింది. సామాజిక, రాజకీయ ఉద్రిక్తలకు కారణమైంది. ఎందుకంటే.. ఈ ఘటనకు పదేళ్లు ముందు 1831 సంవత్సరంలో నాట్ టర్నర్ అనే నల్ల జాతి మత బోధకుడు.. బానిసత్వంపై తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఈ ఉద్యమానికి ముందు మొక్క జొన్న పంటపై రక్తపు చుక్కలు కనిపించాయని పలు చారిత్రక కథనాలు వెల్లడించాయి. ఈ ఉద్యమంలో సుమారు 55 మంది శ్వేతజాతీయులు చనిపోయారు. ఆ తర్వాత మిలీషియా బృందాలు, మూకలు పెద్ద సంఖ్యలో బానిసలను, నల్లజాతీయులను చంపేశారు. ఆ ఘటనను ఇంకా మరిచిపోని శ్వేతజాతీయులు.. పొగాకు తోటలో రక్తపు వర్షం గురించి తెలుసుకుని మరింత వణికిపోయారు. ఇది మరో బానిసల తిరుగుబాటు కావచ్చని భావించారు. వెంటనే అప్రమత్తమయ్యారు.

1876లో మళ్లీ మాంసపు వర్షం

1841లో జరిగిన మాంసపు వర్షం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్లీ 1876లో కూడా మాంసం ముద్దల వర్షం కురిసింది. ఈ సారి అమెరికాలోని కెంటకీలోని బాత్ కౌంటీలో కురిసింది. అలెన్, రెబెక్కా క్రౌజ్ అనే దంపతులకు చెందిన పొలంలో మాంసపు ముక్కలు ఆకాశం నుంచి వర్షాల కురిశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు ఒక బండి నిండా నింపిన మాంసాన్ని ఒక్కసారే కిందకి పోసినట్లుగా ఆ వర్షం ఉందన్నారు. ఈ ఘటన చరిత్రలో ‘కెంటకీ మీట్ షవర్’గా ప్రసిద్ధి చెందింది. అది పెద్ద మాంసపు వర్షంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఈ ఘటన నమోదైంది. 1851లో కాలిఫోర్నియాలోని బెనిషియాలో, 1869 లాస్ నిటోస్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి.

Also Read: ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!

ఇండియాలోనూ కురిసింది

ఆకాశం నుంచి రక్తపు వర్షం కురవడం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. 2001లో కేరళలో కూడా ఇలాంటి వర్షమే కురిసింది. అయితే, అది మాంసపు ముద్దల వాన కాదు. రక్తాన్ని తలపించే ఎర్రటి వాన. దీనిపై శాస్త్రవేత్తలు భిన్న అభిప్రాయాలు వెల్లడించారు. ఆల్గేకు చెందిన సూక్ష్మ బీజకణాల వల్లే వర్షం ఎర్రగా కురిసిందని ఒక పరిశోధన బృందం వెల్లడించింది. మరో బృందం మాత్రం పశ్చిమ ఆసియా ఎడారుల నుంచి గాలిలో ప్రయాణించిన దూళి వల్లే వర్షం ఎర్ర రంగులోకి మారిందని పేర్కొంది. అయితే, 1841లో టెన్నిస్సీలో జరిగిన ఘటన మాత్రం దీనికి భిన్నమైనది. అక్కడి నమూనాల్లో జంతు కణజాలం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. కానీ, ఒక సుడిగాలి జంతు కళేబారాన్ని చిధ్రం చేయగలదా? ఆ జంతువులను చిన్న భాగాలుగా చేసింది ఎవరు? వంటి ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు.

Tags

Related News

రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్లు!

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు.. 20 అద్భుతమైన ఫీచర్లు ఇవే?

ఈ నేషనల్ హైవే ఒకప్పుడు మరణాలకు కేరాఫ్.. నిత్యం రక్తంతో ఎరుపెక్కేది!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!

మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

Big Stories

Advertisement
×