Mettu Sai Kumar: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పిసిసి ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టుసాయి కుమార్ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు 14 సంవత్సరాల వనవాసం విధించారని, అందులో మూడేళ్లు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 11 ఏళ్ల శిక్ష మిగిలే ఉందంటూ చురకలు అంటించారు. అధికారం పోయాక కేటీఆర్‌కు మళ్లీ కవులు, కళాకారులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
కవులను, కళాకారులను అవమానించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కవులను, కళాకారులను ‘గంజిలో ఈగ’లా తీసిపారేశారని మెట్టుసాయి కుమార్ ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వంలో కనీసం ప్రగతి భవన్ గేటు కూడా తాకనివ్వకుండా వారిని అవమానించారని ఆరోపించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా రోడ్డుపై కూర్చోబెట్టింది, ప్రజాకవి అందెశ్రీని తీవ్రంగా అవమానించింది కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆ కవుల, కళాకారుల కన్నీటి శాపం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని స్పష్టం చేశారు.
కళాకారులకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులను సత్కరించిందని ఆయన గుర్తుచేశారు. గద్దర్ పేరిట రాష్ట్ర ఫిలిం అవార్డులను ప్రకటించడంతో పాటు, అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా మార్చామని తెలిపారు. అలాగే అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేయడం, కవి గోరేటి వెంకన్నకు కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇల్లు కేటాయించడం కాంగ్రెస్ కట్టుబాటుకు నిదర్శనమన్నారు. నిజంగా కళాకారులు గళం విప్పితే అది బీఆర్ఎస్ పదేళ్ల మోసపూరిత పాలనపైనే అయి ఉండాలని సూచించారు.
కేటీఆర్ రెండు నాలుకల వైఖరిపై విమర్శలు
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం పోయాక మరోలా కేటీఆర్ నటిస్తున్నారని మెట్టుసాయి కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నోటిని ఫినాయిల్‌తో కడగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారం పోగానే మళ్లీ కాళ్లకు గజ్జెలు, చేతిలో మైకులు గుర్తుకురావడం కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. ఆయన పాత వీడియోలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంపై బీజేపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు
బీజేపీ నేతల వైఖరిని ఎండగడుతూ… ‘ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే అది మన మూతిపైనే పడుతుంది’ అని హెచ్చరించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రామచందర్ రావుల వలే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లూ మొక్కలేదని, ఎవరి చెప్పులూ మోయలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఆయన గురించి విమర్శలు చేసే నైతిక అర్హత బీజేపీ నేతలకు అస్సలు లేదని విలేకరుల సమావేశంలో తేల్చి చెప్పారు.
Also Read: ‘మేం ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తాం.. మీరే బలైపోతున్నారు’! జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్!